భారత్-బంగ్లాదేశ్ మధ్య గంగా జలాల పంపిణీపై కుదిరిన ఒప్పందం పునరుద్ధరణకు ముందు బిహార్ ప్రయోజనాలను విస్మరించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

జేడీయూ రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా ఆగస్టు 6న రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా బిహార్ నీటి అవసరాలను రక్షించాలని కేంద్రాన్ని కోరారు. దీనికి స్పందిస్తూ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆగస్టు 28 తేదీతో ఆయనకు లేఖ రాశారు.

2026 డిసెంబర్‌లో ముగియనున్న ఒప్పందం

భారత్, బంగ్లాదేశ్ మధ్య 1996 డిసెంబర్ 12న గంగా వాటర్ షేరింగ్ ట్రీటీ కుదిరింది. ఈ ఒప్పందం గంగా నదిలోని నీటిని ముఖ్యంగా ఎండాకాలంలో ఫరక్కా బ్యారేజీ వద్ద రెండు దేశాల మధ్య ఎలా పంచుకోవాలన్న అంశాన్ని నియంత్రిస్తుంది.

30 ఏళ్ల కాలపరిమితితో కుదిరిన ఈ ఒప్పందం 2026 డిసెంబర్‌లో ముగియనుంది. దీంతో దీని పునరుద్ధరణ లేదా కొత్త ఒప్పందంపై చర్చలు కీలక దశకు చేరుకున్నాయి.

బిహార్ అభ్యంతరాలపై జైశంకర్ హామీ

జైశంకర్ తన లేఖలో గంగా ఒప్పందానికి సంబంధించి బిహార్ వ్యక్తం చేసిన ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అర్థం చేసుకుందని తెలిపారు.

జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వివిధ మంత్రిత్వ శాఖలు, సంబంధిత వర్గాలతో ఇప్పటికే చర్చలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఒప్పందం అమలు, భవిష్యత్‌పై సమగ్రంగా పరిశీలన జరిపినట్లు తెలిపారు.

2023లో రెండు సందర్భాల్లో, 2024లో మరో రెండు సందర్భాల్లో బిహార్ ప్రభుత్వ అధికారిక ప్రతినిధులు ఈ సంప్రదింపుల్లో పాల్గొన్నారని జైశంకర్ తెలిపారు. ఆ సమావేశాల్లో రాష్ట్ర తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను కూడా చర్చించినట్లు పేర్కొన్నారు.

బిహార్ ఏం కోరుతోంది?

జేడీయూ నేత సంజయ్ ఝా.. ప్రస్తుత రూపంలో గంగా ఒప్పందాన్ని పునరుద్ధరించవద్దని కేంద్రాన్ని కోరుతున్నారు. ఒప్పందం వల్ల బిహార్‌కు గత మూడు దశాబ్దాల్లో నష్టం జరిగిందని ఆయన వాదిస్తున్నారు.

రాష్ట్రానికి తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, పారిశ్రామిక అవసరాల కోసం భవిష్యత్ నీటి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ముఖ్యంగా 2050 నాటికి బిహార్ జనాభా, నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయ అంచనాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.

‘బిహార్ ఎలాంటి ప్రత్యేక రాయితీ కోరడం లేదు’

కేంద్రం స్పందనపై సంజయ్ ఝా సంతృప్తి వ్యక్తం చేశారు. బిహార్ ప్రజలకు న్యాయమైన నీటి వాటా లభించేలా నిర్ణయం ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

బిహార్ ప్రత్యేకమైన అనుకూలతను కోరడం లేదని, శాస్త్రీయ అంచనాలు సూచించే మేరకు రాష్ట్ర అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని మాత్రమే కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు.

భారత్-బంగ్లాదేశ్ చర్చల్లో కీలక అంశం

గంగా ఒప్పందం పునరుద్ధరణ కేవలం రెండు దేశాల మధ్య దౌత్య అంశం మాత్రమే కాకుండా.. భారత్‌లోని గంగా పరివాహక ప్రాంత రాష్ట్రాల నీటి అవసరాలతో కూడా ముడిపడి ఉంది.

ఒప్పందం గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో చర్చలు కొనసాగుతుండగా, బిహార్ ఆందోళనలను సమతుల్యం చేయడం కేంద్రానికి మరో ముఖ్యమైన అంశంగా మారింది.