బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన 94 ఏళ్ల ప్రవాసాంధ్రురాలు కొండ్రగుంట మహాలక్ష్మమ్మ భారత పౌరసత్వాన్ని తిరిగి పొందేందుకు అధికారులను వేడుకున్నారు. జీవితాంతం భారతీయురాలిగానే ఉండాలని, స్వగ్రామంలోనే చివరి శ్వాస విడవాలన్న తన కోరికను జిల్లా కలెక్టర్‌ జె. వెంకట్ వినోద్‌కుమార్‌ దృష్టికి తీసుకువచ్చారు.

భర్త నాగభూషణం మరణానంతరం మహాలక్ష్మమ్మ అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం పీటర్స్‌బర్గ్‌లో స్థిరపడిన తన కుమారుడు, ప్రముఖ క్యాన్సర్‌ వైద్యుడు డాక్టర్‌ కొండ్రగుంట బుచ్చయ్య చౌదరి వద్దకు వెళ్లారు. అనంతరం 2000 జూలై 27న అమెరికా పౌరసత్వాన్ని పొందారు. దాదాపు 18 సంవత్సరాల పాటు అక్కడే నివసించిన ఆమె, 2018లో కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన చింతగుంపలకు తిరిగి వచ్చారు.

ప్రస్తుతం మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ వైద్య కళాశాల డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో మహాలక్ష్మమ్మ గత ఎనిమిదేళ్లుగా స్వగ్రామంలోనే నివసిస్తున్నారు. భారతీయురాలిగా జన్మించిన తాను భారత పౌరురాలిగానే చివరి శ్వాస తీసుకోవాలని భావించి, అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని భారత పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.

భారత పౌరసత్వ పునరుద్ధరణకు సంబంధించిన దరఖాస్తుపై మంగళవారం కలెక్టరేట్‌లో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మమ్మ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, దేశ చట్టాలకు లోబడి ఉంటానని అధికారికంగా హామీ ఇచ్చారు. వృద్ధాప్యంలో స్వదేశంలో జీవించే హక్కును కల్పించాలని అధికారులను కోరారు.

దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, విచారణ ప్రక్రియ పూర్తయ్యాక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక చేరుతుందని, అన్ని నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తయిన తర్వాత మహాలక్ష్మమ్మకు భారత పౌరసత్వం మంజూరు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె కుమారుడు డాక్టర్‌ బుచ్చయ్య చౌదరి కూడా వెంట ఉండి అవసరమైన వివరాలు అందజేశారు.