బీహార్‌లోని ఓ గ్రామంలో నాగ పంచమి సందర్భంగా జరిగే అరుదైన సంప్రదాయం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. బెగుసరాయ్ జిల్లా మన్సూర్‌చక్ బ్లాక్‌లోని నవ్‌టోల్ గ్రామంలో ప్రతి ఏడాది గ్రామస్తులు బాలన్ నదిలోకి దిగి విషపూరితమైన పాములను పట్టుకుని వాటిని మెడలో ధరించి డప్పుల దరువులకు నృత్యాలు చేస్తూ భగవతి ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు వందలాది మంది దూర ప్రాంతాల నుంచి తరలివస్తారు.
గ్రామస్తుల కథనం ప్రకారం ఈ సంప్రదాయం దాదాపు 300 సంవత్సరాల క్రితం భగవతి భక్తుడు రౌబీ దాస్ ప్రారంభించగా, అప్పటి నుంచి ఆయన వారసులు, గ్రామ ప్రజలు దీనిని కొనసాగిస్తున్నారు. ఈ కారణంగానే నవ్‌టోల్‌ను "పాముల గ్రామం"గా కూడా పిలుస్తారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో నాగ పంచమి రోజున పాములకు పాలు పోసి పూజలు చేసే ఆచారం ఉండగా, నవ్‌టోల్‌లో మాత్రం నది నుంచి పట్టిన పాములతో ఊరేగింపు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
గ్రామస్తులు ఈ సంప్రదాయానికి పర్యావరణ ప్రాముఖ్యత కూడా ఉందని చెబుతున్నారు. ప్రకృతి సమతుల్యతలో పాముల పాత్ర కీలకమని, సనాతన ధర్మంలో నాగులకు ఉన్న విశిష్ట స్థానాన్ని గుర్తు చేస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని అంటున్నారు. విష్ణువు, శివుడు వంటి దేవతలతో నాగుల అనుబంధం కూడా ఈ విశ్వాసాన్ని మరింత బలపరుస్తుందని వారు పేర్కొంటున్నారు.
మిథిలా పంచాంగాన్ని అనుసరించే ఈ ప్రాంతంలో నాగ పంచమిని దేశంలోని ఇతర ప్రాంతాల కంటే వేరే తేదీన జరుపుకోవడం కూడా మరో ప్రత్యేకతగా నిలిచింది.









