భారత్ లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.52 పెరిగి రూ.3,315 నుంచి రూ.3,367కు చేరింది. డాలర్-రూపాయి మారకపు విలువ దాదాపు 2 శాతం పెరగడమే ఇందుకు కారణమని తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ తెలిపింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పెంపు తప్పనిసరి అయ్యిందని అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక ఈ ధరల పెంపుతో హోటల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వ్యాపారం మందగించిందని, ఇప్పుడు గ్యాస్ ఖర్చులు మరింత పెరగడంతో ధరలను సవరించాల్సి వచ్చిందని చెబుతున్నారు. హైదరాబాద్ వంటి నగరంలోని పలు ఉడుపి హోటళ్లు దోశలు, పూరీలు వంటి ఎల్పీజీ వినియోగం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల ధరలను రూ.30 నుంచి రూ.50 వరకు పెంచాయి. దీంతో కస్టమర్ల సంఖ్య కూడా సుమారు 30 శాతం తగ్గిందని హోటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి.
తెలంగాణలోని సుమారు 42 వేల హోటళ్లు, కేఫేలు, రెస్టారెంట్లు ఈ ధరల పెంపు ప్రభావాన్ని ఎదుర్కొంటున్నట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి.














