భారీ వర్షం.. దారి తెలియని పరిస్థితి.. సహాయం కోసం బస్సు ఎక్కిన 16 ఏళ్ల బాలికకు అదే బస్సులో ఊహించని దారుణం ఎదురైంది! యూపీలోని మెయిన్‌పురికి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని.. తన బంధువును కలిసేందుకు నోయిడా బయలుదేరింది. అయితే భారీ వర్షం, చీకటి కారణంగా పరి చౌక్ వద్ద పొరపాటున దిగిపోయింది.
అదే సమయంలో అటుగా వెళ్తున్న ఖాళీ స్లీపర్ బస్సును ఆపి.. సహాయం కోరింది. దీంతో డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ ఆమెను బస్సులోకి ఎక్కించుకున్నారు.
కానీ బస్సు కదిలిన తర్వాత పరిస్థితి మారిపోయింది. తనపై ఇద్దరూ అత్యాచారం చేశారని బాలిక ఆరోపించింది. ప్రతిఘటించడంతో చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత.. కాశ్మీర్ గేట్ సమీపంలో బాలికను వదిలేసి ఇద్దరూ పరారయ్యారు.
బాలిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. డ్రైవర్, కండక్టర్‌ను అరెస్ట్ చేశారు. బస్సును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.












