సాధారణంగా విషపూరిత జీవులు అంటే పాములు, తేళ్లు గుర్తొస్తాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పక్షిగా గుర్తింపు పొందిన హుడెడ్ పిటోహుయ్ అనే పక్షి కూడా ఉంది. పసిఫిక్ మహాసముద్రంలోని న్యూ గినియా అడవుల్లో కనిపించే ఈ పక్షి చర్మం, ఈకల్లో బాట్రాకోటాక్సిన్ అనే ప్రమాదకర న్యూరోటాక్సిన్ ఉంటుంది. ఈ విషం కొలంబియాలో కనిపించే పాయిజన్ డార్ట్ కప్పలలో ఉండే విషంతో సమానమని శాస్త్రవేత్తలు గుర్తించారు.

1980లలో శాస్త్రవేత్త జాక్ డాంబచెర్ ఈ పక్షిని పరిశోధన కోసం పట్టుకున్న తర్వాత చేతులు, కళ్లలో మంట, తిమ్మిరి రావడంతో దీని విషపూరిత గుణం వెలుగులోకి వచ్చింది. ఈ విషాన్ని పక్షి స్వయంగా ఉత్పత్తి చేయదు. మెలిరిడ్ బీటిల్స్ అనే విషపూరిత కీటకాలను తినడం వల్ల ఈ విషం దాని శరీరంలో చేరుతుంది.

నలుపు-నారింజ రంగులతో కనిపించే ఈ పక్షి తన రంగుల ద్వారానే “నన్ను తాకొద్దు” అనే హెచ్చరిక ఇస్తుంది. స్థానికులు దీన్ని “చెత్త పక్షి” అని పిలుస్తూ దూరంగా ఉంటారు. ప్రకృతిలో విషాన్ని ఆయుధంగా మార్చుకున్న అరుదైన పక్షిగా హుడెడ్ పిటోహుయ్ ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఆశ్చర్యంగానే నిలిచింది.