శ్రీశైలంలో సైబర్ మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను టార్గెట్‌గా చేసుకుని కొందరు కేటుగాళ్లు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నట్టు బయటపడింది.
ఢిల్లీకి చెందిన ఆనంద్‌కుమార్ అనే భక్తుడు శ్రీశైలం మల్లికార్జున సదన్‌లో 9 ఏసీ గదులను ఓ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్నారు. ఇందుకోసం పేటీఎం ద్వారా రూ.15 వేల మొత్తాన్ని చెల్లించారు. శనివారం 27 మంది యాత్రికులతో కలిసి హైదరాబాద్ నుంచి టూరిస్ట్ బస్సులో శ్రీశైలం చేరుకున్నారు.
అయితే మల్లికార్జున సదన్‌లో గదుల కోసం విచారించగా.. తమ పేరుతో ఎలాంటి బుకింగ్ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. దీంతో తాము సైబర్ మోసానికి గురైనట్లు యాత్రికులు గుర్తించారు.
ఈ ఘటనపై శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు స్పందించారు. మోసపోయిన భక్తులకు ఆలయ అధికారులు అండగా నిలిచారు. వారికి ఉచిత వసతి, భోజనం, దర్శన ఏర్పాట్లు చేశారు. బాధితుల నుంచి పీఆర్‌వో లిఖితపూర్వక ఫిర్యాదు స్వీకరించారు.
సైబర్ నేరగాళ్లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆలయ ఈవో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

















