బీహార్‌లో వరకట్న దాహం ఓ కుటుంబం కలలను చిదిమేసింది. ముజఫర్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముస్తఫాపూర్‌కు చెందిన యువతికి వైశాలి జిల్లాకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఫిబ్రవరి 22న ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుక కోసం అమ్మాయి కుటుంబం దాదాపు రూ.14 లక్షలకు పైగా ఖర్చు చేసింది. బంగారు ఆభరణాలు, నగదు, పెళ్లి ఖర్చుల అడ్వాన్స్‌లు అన్నీ ఇచ్చారు.
అయితే… నిశ్చితార్థం ముగిసిన మరుసటి రోజే వరుడి కుటుంబం అసలు డిమాండ్ బయటపెట్టింది. “వాగన్ఆర్ కారు కావాలి” అంటూ ఒత్తిడి తెచ్చింది. అంత స్తోమత లేదని అమ్మాయి కుటుంబం వేడుకున్నా వినలేదు. కారు ఇవ్వలేమని చెప్పగానే… కథ మలుపు తిరిగింది. వరుడి సోదరి ఫోన్ చేసి “అమ్మాయికి జుట్టు పల్చగా ఉంది… జుట్టు రాలిపోతోంది… అందుకే పెళ్లి వద్దు” అంటూ షాకింగ్ సాకులు చెప్పింది. దీంతో అవమానానికి గురైన యువతి తీవ్ర మానసిక వేదనకు గురైంది.
“నిశ్చితార్థానికి ముందు ఎన్నోసార్లు చూసిన వాళ్లే… ఇప్పుడు జుట్టు సమస్య గుర్తొచ్చిందా?” అంటూ బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ముజఫర్‌పూర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వరుడితో పాటు ఆరుగురిపై వరకట్న వేధింపులు, మోసం, దాడి కేసులు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.















