ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన కుటుంబం కూడా ఒకసారి సైబర్ మోసగాళ్ల బారిన పడినట్లు వెల్లడించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, తన కుటుంబ సభ్యులను దాదాపు 6 నుంచి 7 గంటల పాటు "డిజిటల్ అరెస్ట్" పేరుతో భయభ్రాంతులకు గురిచేశారని చెప్పారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలను కూడా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన హెచ్చరించారు.
సుమారు ఐదేళ్ల క్రితం తనకు బ్యాంకు అధికారినంటూ ఫోన్ చేసి పెట్టుబడుల పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నించారని నాగార్జున తెలిపారు. అదే సమయంలో తన కుటుంబ సభ్యులకు కూడా కస్టమ్స్, పోలీసు అధికారులమంటూ ఫోన్ చేసి, వారి పేరుతో మాదకద్రవ్యాల పార్సిల్ విదేశాలకు వెళ్లిందని బెదిరించి గంటల తరబడి వీడియో కాల్‌లో ఉంచినట్లు వివరించారు. ఈ తరహా మోసాన్నే "డిజిటల్ అరెస్ట్"గా పిలుస్తారని చెప్పారు.
సైబర్ నేరాల నుంచి రక్షించుకోవడానికి తాను తరచూ మొబైల్, వై-ఫై పాస్‌వర్డ్‌లను మార్చుకుంటానని, ఫోన్‌లో వ్యక్తిగత సమాచారం లేదా సున్నితమైన ఫొటోలను నిల్వ ఉంచనని నాగార్జున వెల్లడించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, పెట్టుబడి ఆఫర్లు, అనుమానాస్పద లింకుల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ పోలీసులు సైబర్ నేరాల నియంత్రణలో, ప్రజల్లో అవగాహన కల్పించడంలో చేస్తున్న కృషిని నాగార్జున ప్రశంసించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ఇటీవల పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్ తరహా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, మోసపోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.












