అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఖమ్మం జిల్లా యువకుడు గుండెపోటుతో మృతి చెందడం విషాదాన్ని నింపింది. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన ములకలపాటి రవి, లీలావతి దంపతుల కుమారుడు పార్థసారథి అమెరికాలో హఠాన్మరణం చెందారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, పార్థసారథి గత పదేళ్లుగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో జరిగిన తన సోదరి సీమంత వేడుకలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. కార్యక్రమం ముగిసిన అనంతరం విశ్రాంతి తీసుకున్న ఆయనను ఉదయం నిద్రలేపేందుకు ప్రయత్నించగా ఎలాంటి స్పందన లేకపోవడంతో వెంటనే పరిశీలించగా, నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిసింది.
ఈ అనూహ్య ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుమారుడి ఆకస్మిక మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్వగ్రామమైన కిష్టారంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
పార్థసారథి మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.









