అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, ప్రపంచానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గంలో భారత నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాలో దాదాపు ఐదవ వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. యుద్ధ పరిస్థితుల కారణంగా అనేక నౌకలకు అంతరాయం ఏర్పడినా, భారత ప్రభుత్వం దౌత్యపరమైన సమన్వయంతో నౌకల ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగిస్తోంది.
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారి ఓపేశ్ కుమార్ శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్–ఇరాన్ మధ్య సమన్వయం విదేశాంగ శాఖ ద్వారా జరుగుతోంది. అలాగే పెట్రోలియం, ఎరువుల శాఖలతో కలిసి ప్రాధాన్యత క్రమం నిర్ణయించి నౌకలను సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నారు.
ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిలో 13 భారత జెండా నౌకలు ఉన్నాయి. వీటిలో ఒక ఎల్పీజీ ట్యాంకర్, ఐదు ముడి చమురు ట్యాంకర్లు, ఒక కెమికల్ ట్యాంకర్, మూడు కంటైనర్ నౌకలు, రెండు బల్క్ క్యారియర్లు, ఒక డ్రెడ్జర్ ఉన్నాయి.
ప్రజలకు అందుబాటులో ఉన్న నౌకల సమాచారం వల్ల కొంత ప్రమాదం ఉన్నప్పటికీ, అదే సమాచారం నౌకల కదలికలను ట్రాక్ చేయడానికి కూడా సహాయపడుతోందని అధికారులు తెలిపారు. ప్రపంచ ఇంధన సంక్షోభం మధ్య భారత నౌకల ప్రయాణం కొనసాగడం దేశ దౌత్య విజయంగా భావిస్తున్నారు.













