చైనాతో యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. భారీ సబ్సిడీలతో తయారవుతున్న విదేశీ ఉత్పత్తుల దిగుమతులను నియంత్రించేందుకు యూరోపియన్ యూనియన్ ప్రతిపాదనలు తీసుకురావడంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యలను కొనసాగిస్తే యూరోపియన్ యూనియన్‌పై యాంటీ-డిస్క్రిమినేషన్, సప్లై చైన్ సెక్యూరిటీ దర్యాప్తులు ప్రారంభించే అవకాశముందని చైనా ప్రభుత్వ మీడియా హెచ్చరించింది.
చైనా ప్రభుత్వ ప్రసార సంస్థకు చెందిన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ హెచ్చరిక వెలువడింది. యూరోపియన్ యూనియన్ తీసుకొస్తున్న “ఓవర్‌క్యాపాసిటీ ఇన్‌స్ట్రుమెంట్” పేరుతో ఉన్న విధానం చైనా కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటోందని బీజింగ్ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ టెక్నాలజీ ఉత్పత్తులపై రెండు పక్షాల మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తాజా హెచ్చరిక ప్రపంచ వాణిజ్య రంగంలో ఆందోళన కలిగిస్తోంది.












