ఖగోళ ప్రేమికులకు ఆగస్టు 12, 2026 ఓ అద్భుతమైన అనుభూతిని అందించింది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతమైంది. ముఖ్యంగా స్పెయిన్, ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్, ఉత్తర రష్యా తదితర ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది.
1999 తర్వాత యూరప్ ప్రధాన భూభాగంలో కనిపించిన తొలి సంపూర్ణ సూర్యగ్రహణం కావడంతో ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు బహిరంగ ప్రదేశాలు, ప్రత్యేక వీక్షణ కేంద్రాలకు తరలివచ్చారు.
సూర్యుడు, చంద్రుడు, భూమి దాదాపు ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు భూమి, సూర్యుడి మధ్యకు వచ్చి సూర్యుడి కాంతిని పూర్తిగా అడ్డుకున్న ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. చంద్రుడి నీడ భూమిపై పడటంతో కొన్ని ప్రాంతాల్లో పగటిపూటే చీకట్లు కమ్ముకున్నాయి.
సంపూర్ణ గ్రహణం అత్యధికంగా రెండు నిమిషాల లోపే కొనసాగినప్పటికీ.. ఆ కొద్ది సమయం వీక్షకులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందించింది.
స్పెయిన్‌లోని పలు ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపించింది. మాడ్రిడ్, జరగోజా, బిల్బావో, వాలెన్సియా, అస్టూరియాస్ ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీక్షణ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాలకు చేరుకుని గ్రహణాన్ని ఆసక్తిగా తిలకించారు. మాడ్రిడ్‌లో గ్రహణం గరిష్ఠ దశ సాయంత్రం 6:32 గంటల ప్రాంతంలో కనిపించగా.. పలు ప్రాంతాల్లో సంపూర్ణ దశ కొన్ని పదుల సెకన్ల నుంచి దాదాపు రెండు నిమిషాల వరకు కొనసాగింది.












