ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్ చర్చ తెరపైకి వచ్చింది. 2026 మార్చి చివర్లో ప్రపంచవ్యాప్తంగా 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించిన సంస్థ.. ఇప్పుడు మరో రౌండ్ ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యే రెండో త్రైమాసికానికి ముందు ప్రభావిత ఉద్యోగులకు సమాచారం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఎంతమందిపై వేటు పడనుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
మరోసారి తొలగింపులకు గురయ్యే ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని ఒరాకిల్ మేనేజర్లను కోరినట్లు సమాచారం. కొన్ని టీమ్స్‌లో ఉద్యోగుల సంఖ్యను రెండంకెల శాతంలో తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చిలో చేపట్టిన లేఆఫ్స్‌తో కంపెనీ తన మొత్తం ఉద్యోగుల సంఖ్యలో సుమారు 13 శాతం తగ్గించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.41 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
ఒరాకిల్‌లో తాజా లేఆఫ్స్‌కు ఏఐ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పెరుగుతున్న భారీ వ్యయాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు 55 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇందులో ఏఐ మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన ఖర్చులు కీలకంగా ఉన్నాయి. ఇదే సమయంలో డెట్, ఈక్విటీ మార్గాల్లో సుమారు 43 బిలియన్ డాలర్లు సమీకరించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.












