ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిపై అమెరికా ఆధిపత్యం పెరుగుతోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా సైన్యం అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో ఉన్న ఇరాన్‌కు చెందిన సముద్ర మైన్లను తొలగించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. దీంతో కీలకమైన ఈ జలమార్గంలో అంతర్జాతీయ నౌకాయానానికి మార్గం తెరుచుకుందని అమెరికా చెబుతోంది.
‘ఆ జలసంధి తెరిచే ఉంది’.. ట్రంప్
అమెరికా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. “That sucker is open” అంటూ హోర్ముజ్ జలసంధి తెరిచే ఉందని వ్యాఖ్యానించారు.
ఇరాన్ ప్రస్తుతం గతంలో ఉన్నంత వ్యూహాత్మక పట్టు కలిగి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా సైనిక చర్యల తర్వాత ఇరాన్ స్పందన కూడా పరిమితంగానే ఉందని ట్రంప్ పేర్కొన్నారు.
మైన్ల తొలగింపు కీలక పరిణామం
CENTCOM కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ప్రకారం.. అమెరికా నేవీ డైవర్లు, సీల్ బృందాలు, ఇతర సైనిక విభాగాల వైమానిక సహకారంతో హోర్ముజ్‌లోని నౌకాయాన మార్గాల నుంచి సముద్ర మైన్లను తొలగించారు.
ఈ చర్యను ఆయన “మేజర్ మైలురాయి”గా అభివర్ణించారు. దాదాపు 1,500 వాణిజ్య నౌకలు అమెరికా రక్షణలో హోర్ముజ్ మార్గం గుండా ప్రయాణించినట్లు అమెరికా తెలిపింది.
అయితే నౌకల రాకపోకలు ఇంకా తక్కువే
అమెరికా హోర్ముజ్ జలసంధి తెరిచే ఉందని చెబుతున్నప్పటికీ.. వాణిజ్య నౌకల రాకపోకలు యుద్ధానికి ముందు స్థాయికి ఇంకా చేరుకోలేదు.
ఇటీవలి గణాంకాల ప్రకారం కొన్ని నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో షిప్పింగ్ కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.
ఇరాన్ మాత్రం భిన్నంగా చెబుతోంది
హోర్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకుందన్న అమెరికా వాదనను ఇరాన్ పూర్తిగా అంగీకరించడం లేదు.
అమెరికా తన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడంతో పాటు యుద్ధాన్ని ముగించాలి అని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇరాన్, ఒమన్ కలిసి తాత్కాలిక నౌకాయాన మార్గం ఏర్పాటు చేసే ప్రతిపాదనపై చర్చలు జరుపుతున్నప్పటికీ.. జలసంధి పూర్తిగా తెరవడంపై ఇంకా స్పష్టమైన ఒప్పందం కుదరలేదు.
ఇరాన్ పోర్టులపై అమెరికా దిగ్బంధం
అమెరికా హోర్ముజ్ ప్రాంతంలో మైన్ల తొలగింపుతో పాటు ఇరాన్ పోర్టులపై నౌకాదళ దిగ్బంధాన్ని కొనసాగిస్తోంది.
ఇరాన్ నుంచి చమురు రవాణాను అడ్డుకునేందుకు అమెరికా చర్యలు చేపడుతోంది. దీంతో హోర్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు ఉన్న వ్యూహాత్మక ప్రభావాన్ని తగ్గించడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది.
ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం
హోర్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటి. ఈ ప్రాంతంలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరా, ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
అందుకే హోర్ముజ్‌లో నౌకాయానం పునరుద్ధరణ అంతర్జాతీయ మార్కెట్లకు కూడా కీలక పరిణామంగా మారింది.












