భారత సైన్యం ఉపయోగిస్తున్న పాత ఇన్‌సాస్ (INSAS) రైఫిళ్ల స్థానంలో పూర్తిగా స్వదేశీ విడిభాగాలతో రూపొందించిన ఏకే-203 ‘షేర్’ (AK-203 Sher) రైఫిళ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఉన్న ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) కర్మాగారంలో ఏకే-203 తొలి ప్రోటోటైప్‌ల పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి.
సెప్టెంబర్‌లో భారత సైన్యం నిర్వహించనున్న తుది యూజర్ ట్రయల్స్ కోసం ప్రోటోటైప్‌లను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రైఫిళ్ల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు కర్మాగారంలో ప్రతి 100 సెకన్లకు ఒక రైఫిల్ తయారు చేసే స్థాయికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నారు.
‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా భారత సైన్యం కోసం 6 లక్షలకు పైగా ఏకే-203 రైఫిళ్లను సమకూర్చే భారీ ప్రణాళికను ప్రభుత్వం చేపట్టింది. పూర్తిగా భారతీయ విడిభాగాలతో తయారయ్యే ఈ రైఫిళ్లు దేశ రక్షణ రంగంలో స్వావలంబనకు మరో ముందడుగుగా నిలవనున్నాయి.









