తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న థియేటర్ల సంక్షోభంపై నిర్మాతలు స్పందించారు. ఎగ్జిబిటర్లు మాత్రమే కాదు, నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టం చేశారు. బెదిరింపులు, డెడ్‌లైన్లు, ఏకపక్ష నిర్ణయాలతో సమస్యలు పరిష్కారం కావని, అందరూ కలిసి చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు కనుగొనాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో నిర్మాతలు రవి శంకర్, నాగ వంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు. థియేటర్లలో శాతం పద్ధతి వెంటనే అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయడంపై స్పందించిన వారు, గత కొన్నేళ్లుగా నిర్మాతలు కూడా భారీ నష్టాలను భరిస్తున్నారని పేర్కొన్నారు.