ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) హఠాన్మరణంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో నారాయణరావు పార్థివదేహానికి నివాళులర్పించిన చిరంజీవి.. దాదాపు ఐదు దశాబ్దాల స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
తమ అనుబంధం 1977లో మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ రోజుల నుంచే ప్రారంభమైందని చిరంజీవి తెలిపారు. తాను నటనలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో నారాయణరావు సీనియర్ విద్యార్థిగా పరిచయమయ్యారని గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి తమ స్నేహం ఎంతో ఆత్మీయంగా కొనసాగిందన్నారు.
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘యముడికి మొగుడు’, ‘దేవాంతకుడు’ వంటి విజయవంతమైన చిత్రాలను నారాయణరావు నిర్మించారు. ‘చట్టానికి కళ్లు లేవు’, ‘ఇంటికో రుద్రమ్మ’ వంటి పలు చిత్రాలతో నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. సినిమా అంటే నారాయణరావుకు ఎంతో ప్రాణమని, ఏ పని చేపట్టినా పూర్తయ్యే వరకు పట్టుదలతో పనిచేసేవారని చిరంజీవి కొనియాడారు.
ఇటీవల జరిగిన చివరి భేటీని గుర్తుచేసుకుంటూ చిరంజీవి కంటతడి పెట్టారు. కొద్దిరోజుల క్రితమే నారాయణరావు తన వద్దకు వచ్చి కొత్త ప్రాజెక్ట్ ట్రైలర్‌ను తన చేతుల మీదుగా విడుదల చేయాలని కోరారని తెలిపారు. తప్పకుండా చేద్దామని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపానని.. అదే తమ చివరి భేటీ, చివరి సంభాషణ అవుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
1976లో కె. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతులేని కథ’ చిత్రంతో నటుడిగా నారాయణరావు సినీ ప్రయాణం ప్రారంభమైంది. వెండితెరతో పాటు పలు బుల్లితెర సీరియల్స్‌లోనూ నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఆయన సినీ సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చిరంజీవి పేర్కొన్నారు. నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినీ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య మహాప్రస్థానంలో నారాయణరావు అంత్యక్రియలు ముగిశాయి.










