అమెరికాలో డీజిల్ ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. జాతీయ సగటు ధర గ్యాలన్‌కు 5.85 డాలర్లకు పెరిగింది. ఇరాన్‌తో కొనసాగుతున్న ఆరు నెలల యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి.
డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కావడం లేదు. అమెరికా సరుకు రవాణా వ్యవస్థలో ట్రక్కులు, రైళ్లు, నౌకలు, వ్యవసాయ యంత్రాలు వంటి అనేక రంగాలు డీజిల్‌పై ఆధారపడుతున్నాయి. దీంతో రవాణా ఖర్చులు పెరిగి.. ఆ భారం క్రమంగా నిత్యావసర వస్తువుల ధరలపై పడుతోంది.
ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, మాంసం, సీఫుడ్ వంటి త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలపై ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయ పరికరాల నుంచి సరుకులను సూపర్‌మార్కెట్లకు తరలించే ట్రక్కుల వరకు డీజిల్ కీలకంగా ఉండటంతో.. ఇంధన ధరల పెరుగుదల చివరికి వినియోగదారుల జేబుపై భారంగా మారుతోంది.
నిపుణుల ప్రకారం.. మొదట్లో ఈ అదనపు ఖర్చును రవాణా సంస్థలు, రిటైలర్లు తమ మార్జిన్లలో భరిస్తున్నప్పటికీ.. డీజిల్ ధరలు ఎక్కువకాలం కొనసాగితే ఫ్యూయల్ సర్‌చార్జీలు, పెరిగిన రవాణా ఒప్పందాల రూపంలో ఆ భారం నేరుగా వినియోగదారులపై పడే అవకాశం ఉంది.
ఇప్పటికే కొన్ని ఈ-కామర్స్, డెలివరీ సంస్థలు అదనపు ఇంధన ఛార్జీలను విధించడం ప్రారంభించాయి. అమెజాన్ కొన్ని థర్డ్-పార్టీ విక్రేతలపై తాత్కాలికంగా 3.5 శాతం ఫ్యూయల్, లాజిస్టిక్స్ సర్‌చార్జ్ విధించింది. UPS, FedEx, USPS వంటి సంస్థలు కూడా ఇంధన వ్యయాల పెరుగుదల నేపథ్యంలో కొన్ని ప్యాకేజీలపై అదనపు ఛార్జీలను అమలు చేశాయి.
ఇక గ్యాసోలిన్ ధరలు కూడా పెరుగుతున్నాయి. అమెరికాలో రెగ్యులర్ గ్యాసోలిన్ సగటు ధర ప్రస్తుతం గ్యాలన్‌కు 4.15 డాలర్లు. గత ఏడాది ఇదే సమయంలో ఇది 3.20 డాలర్లుగా ఉంది.
డీజిల్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాల్లో ఒకటి ముడి చమురు ధరలు పెరగడం. మధ్యప్రాచ్యంలో సరఫరా అంతరాయాలు, హోర్ముజ్ జలసంధిలో ట్యాంకర్ రాకపోకలకు ఏర్పడిన అడ్డంకులు అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర శుక్రవారం బ్యారెల్‌కు 95 డాలర్లకు పైగా నమోదైంది.
2022లో ఉక్రెయిన్ యుద్ధం సమయంలో డీజిల్ ధరలు గ్యాలన్‌కు 5.82 డాలర్ల వరకు చేరాయి. అయితే ప్రస్తుతం రికార్డు స్థాయిలో నమోదవుతున్న ధరలు.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా రవాణా, ఆహార ధరలకు మరింత ఒత్తిడిని తీసుకురావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంధన ధరల పెరుగుదల అమెరికా ఆర్థిక వ్యవస్థపై రాజకీయ ప్రభావాన్ని కూడా చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో.. డీజిల్, గ్యాసోలిన్ ధరలు మరింత పెరిగితే నవంబర్ మధ్యంతర ఎన్నికలకు ముందు ట్రంప్ ప్రభుత్వానికి ఇది మరో సవాలుగా మారే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యం నుంచి ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే ఆఫ్రికా, ఆసియా దేశాల్లో డీజిల్ ధరలు భారీగా పెరిగాయి.
నిపుణుల హెచ్చరిక ఒక్కటే.. ఇంధన నిల్వలు తగ్గుతూ, రిఫైనింగ్ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగడం సాధ్యం కాదని చెబుతున్నారు.









