భారత విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గాయి. మే 22తో ముగిసిన వారానికి దేశ విదేశీ మారక నిల్వలు 681.4 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. అంతకుముందు వారం ఇవి 688.89 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఒక్క వారంలోనే సుమారు 7.5 బిలియన్ డాలర్ల తగ్గుదల నమోదైంది.

ఈ తగ్గుదలకు ప్రధాన కారణం ఆర్‌బీఐ వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ పడిపోవడమేనని తెలిపింది. గోల్డ్ రిజర్వుల విలువ 4.5 బిలియన్ డాలర్లు తగ్గి 114.7 బిలియన్ డాలర్లకు చేరింది. అలాగే విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ కూడా దాదాపు 3 బిలియన్ డాలర్లు తగ్గి 543 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో 728.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో రూపాయి పై ఒత్తిడి పెరిగింది. రూపాయి విలువ పడిపోవడంతో ఆర్‌బీఐ డాలర్లు విక్రయిస్తూ మార్కెట్‌లో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రూపాయి విలువ దాదాపు 4 శాతం క్షీణించినట్లు సమాచారం. పెరిగిన చమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో విదేశీ ప్రయాణాలు తగ్గించాలి, ఇంధన వినియోగాన్ని నియంత్రించాలి, కొంతకాలం బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.