అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ADA గ్రూప్‌కు సంబంధించిన వేల కోట్ల ఆర్థిక మోసం కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో తొలి ఛార్జ్‌షీట్‌ను ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. మొత్తం 16 మందిని నిందితులుగా చేర్చగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థతో పాటు ఐదుగురు సీనియర్ అధికారులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, మాజీ సిండికేట్ బ్యాంక్‌కు చెందిన 10 మంది బ్యాంకు అధికారుల పేర్లు ఉన్నాయి.
నిందితులపై క్రిమినల్ కుట్ర, మోసం, ప్రజా ధన దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. సీబీఐ దర్యాప్తు ప్రకారం బ్యాంకులు మంజూరు చేసిన రూ.2,050 కోట్ల రుణాలను వ్యాపార అవసరాలకు వినియోగించకుండా ఇతర మార్గాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసు మూలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు. ప్రారంభంగా SBIకి రూ.2,929 కోట్ల నష్టం కలిగించినట్లు పేర్కొనగా, మొత్తం 17 ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించిన అప్పులు కలిపి రూ.19,694 కోట్లకు పైగా ఉన్నట్లు FIRలో వెల్లడైంది.
ఈ వ్యవహారంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ వంటి అనిల్ అంబానీ గ్రూప్ సంస్థలపై సీబీఐ ఇప్పటికే ఏడు FIRలు నమోదు చేసింది. భారీ ప్రజా ధనం సంబంధం ఉండటంతో ఈ కేసుల దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. మరిన్ని నిందితుల పాత్రపై విచారణ కొనసాగుతోందని, త్వరలో అదనపు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసే అవకాశం ఉందని సీబీఐ తెలిపింది.













