భారత్‌ ఆర్థిక వ్యవస్థ మరోసారి సత్తా చాటింది. 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దేశ వాస్తవ GDP 7.8 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 6.9 శాతంతో పోలిస్తే వృద్ధి మరింత పెరిగింది. ఆర్‌బీఐ అంచనా వేసిన 7 శాతం కంటే కూడా తాజా వృద్ధి అధికంగా ఉండటం విశేషం.

ఈ గణాంకాలపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సప్లై చెయిన్‌ అంతరాయాలు, ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్‌ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు.

భారత్‌ వృద్ధిపై నిరాశావాద ప్రచారం చేస్తున్న వారిపై మోదీ తీవ్రంగా స్పందించారు. “జూత్ కీ గూంజ్” అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి నెగెటివ్‌ నేరేటివ్‌ను తాజా GDP గణాంకాలు బద్దలు కొట్టాయని వ్యాఖ్యానించారు.

ఇక ఇదే వేగాన్ని కొనసాగిస్తూ ఆత్మనిర్భర్‌ భారత్‌, స్వదేశీ, వోకల్‌ ఫర్‌ లోకల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు. విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో పెళ్లిళ్లకు బదులుగా దేశీయంగా ఖర్చు చేయాలని సూచించారు.