భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘన విజయాన్ని అందుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శుక్రవారం తెల్లవారుజామున GSLV-F17 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున 2:55 గంటలకు ప్రయోగం చేపట్టారు.

GSLV రాకెట్‌ తనతో పాటు తీసుకెళ్లిన అత్యాధునిక EOS-05 (Geo-Imaging Satellite) ఉపగ్రహాన్ని నిర్దేశిత సబ్‌-జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో చైర్మన్‌ డా. వి. నారాయణన్‌ మాట్లాడుతూ.. GSLV వాహకనౌక EOS-05 ఉపగ్రహాన్ని అత్యంత కచ్చితత్వంతో నిర్దేశిత కక్ష్యలోకి చేర్చిందని తెలిపారు. ఈ విజయంతో GSLV తన 19వ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు.

36 వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి నిఘా!

EOS-05 ఉపగ్రహం భూమిని నిరంతరం పరిశీలిస్తూ దాదాపు 36 వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి భారతదేశాన్ని నిశితంగా చిత్రీకరించనుంది. సమీప రియల్‌టైమ్‌ ఇమేజింగ్‌ సామర్థ్యంతో ఈ ఉపగ్రహం భూ పరిశీలనలో కీలకంగా మారనుంది.

కనిపించే కాంతి, ఇన్‌ఫ్రారెడ్‌, మల్టీస్పెక్ట్రల్‌, హైపర్‌స్పెక్ట్రల్‌ బ్యాండ్లలో అధునాతన చిత్రాలను అందించే సామర్థ్యం EOS-05కు ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. జియోసింక్రోనస్‌ కక్ష్య నుంచి భారతదేశానికి సంబంధించిన అధునాతన చిత్రాలను అందించే తొలి ఇమేజింగ్‌ ఉపగ్రహంగా దీనిని ఆయన పేర్కొన్నారు.

420 టన్నులకు పైగా బరువు.. 51.7 మీటర్ల ఎత్తు

GSLV-F17 రాకెట్‌ 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల లిఫ్ట్‌ఆఫ్‌ మాస్‌తో భారత్‌ ప్రయోగిస్తున్న అతిపెద్ద ఆపరేషనల్‌ రాకెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ ప్రయోగంలో GSLV ద్వారా GTO లేదా సబ్-GTO కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అత్యంత భారీ ఉపగ్రహంగా EOS-05 నిలిచిందని మిషన్‌ డైరెక్టర్‌ తెలిపారు.

ఈ ఏడాదే తొలి అన్‌క్రూడ్‌ గగన్‌యాన్‌!

EOS-05 ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్‌ మరో కీలక ప్రకటన చేశారు. తొలి అన్‌క్రూడ్‌ గగన్‌యాన్‌ మిషన్‌ను ఇదే క్యాలెండర్‌ సంవత్సరంలో ప్రయోగించేందుకు పనులు వేగంగా, క్రమబద్ధంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నావిగేషన్‌ శాటిలైట్‌ NVS-03 సహా మరో ఆరు ప్రయోగాలను చేపట్టేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు నారాయణన్‌ తెలిపారు.

EOS-05 విజయవంత ప్రయోగంతో భారత అంతరిక్ష సామర్థ్యాలు మరో స్థాయికి చేరాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అభినందించారు. ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని పేర్కొన్నారు.