గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బల్యాన్ హత్య కేసులో ఇద్దరు అనుమానితులు ఎన్‌కౌంటర్ అయ్యారు. హర్యానాలోని సోనిపట్‌కు చెందిన మోహిత్ (22), సుమిత్ (24) అనే ఇద్దరు నిందితులు షామ్లీ పట్టణంలోని కైరానా రోడ్డులో ఉన్న ఇండియన్ గ్యాస్ గోదాం సమీపంలో సోమవారం తెల్లవారుజామున పోలీసుల ఎదురుకాల్పుల్లో గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అనంతరం వారు మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్ ఘటనకు కొన్ని గంటల ముందు ఉత్తరప్రదేశ్ డీజీపీ రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ..అంకిత్ బల్యాన్ హత్య ముందస్తు కుట్రలో భాగమని వెల్లడించారు.

గోగి గ్యాంగ్‌తో సంబంధాలున్న నెట్‌వర్క్ ఈ హత్య వెనుక ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై అంకిత్ తండ్రి సత్వీర్ సింగ్ స్పందించారు. పోలీసులకు కృతజ్ఞతలు చెబుతూనే తమకు సగం న్యాయం జరిగిందన్నారు. మిగిలిన సగం న్యాయం కూడా త్వరలో జరగాలని కోరారు. అంకిత్ సోదరి రీనా మాత్రం కుటుంబానికి ‘పూర్తి న్యాయం’ కావాలని స్పష్టం చేశారు. కోర్టుల చుట్టూ తిరగడం తమకు ఇష్టం లేదని, మిగిలిన నిందితుల విషయంలోనూ ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.