
ఖాట్మండూ: ఒకవైపు నేపాల్ దేశాన్ని వరదలు అతలాకుతలంగా చేయగా, మరోవైపు సందిట్లో సడేమియా అన్నట్టు కొందరు దీన్ని అవకాశంగా చేసుకుని దొరికిన వస్తువులను దొరికినట్టు చక్కబెట్టేస్తున్నారు. తాజాగా వరదల ఉద్ధృతికి కొట్టుకువచ్చిన ఒక బ్యాంకు సేఫ్టీ లాకర్‌ను స్థానికులు కొందరు పగలగొట్టి అందులోని భారీ మొత్తంలో నగదును అపహరించారు. ఇందుకు పాల్పడిన 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.92 లక్షల పైచిలుకు నేపాలీ రూపాయలను (భారత కరెన్సీలో సుమారు రూ.57 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, రసువా జిల్లాలోని భోటేకోషి ప్రాంతంలో సంభవించిన వరద ఉద్ధృతికి ఒక బ్యాంకుకు చెందిన సేఫ్టీ లాకర్ కొట్టుకుపోయింది. దాధింగ్లోని గల్చీ గ్రామీణ మున్సిపాలిటీ 4వ వార్డులోని బెల్ఖుఖోలాలో ఈ సేఫ్ లభించింది. స్థానికులు కొందరు సేఫ్‌ను పగులగొట్టి నగదును పంచుకున్నట్టు సమాచారం అందడంతో పోలీసలు రంగప్రవేశం చేసారు. ప్రాథమిక విచారణ అనంతరం సోదాలు జరిపిన నగదును స్వాధీనం చేసుకున్నారు. అదుపులోనికి తీసుకున్న వారిలో ఎక్కువమంది గల్చీ-4లోని మస్తర్ ప్రాంతానికి చెందిన వారున్నారు. వీరి వయసు 19 నుంచి 49 సంవత్సరాల మధ్య ఉంది.
కాగా, నగదు ఎక్కడి నుంచి వచ్చింది, మరెవరి ప్రమేయమైనా ఇందులో ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. కాగా, నారాయణి నదిలో కొట్టుకువచ్చిన ఒక మహిళ మృతదేహం నుంచి బంగారు చెవిదుద్దులు చోరీ చేసిన ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ ఆరెస్టులు చేశారు.











