ఖాట్మండూ: సున్నితమైన హిమాలయ ప్రాంతాన్ని ప్రభావితం చేసే విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు, సహకారాన్ని బలపేతం చేసేందుకు ఐదు దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటు చేయాలని భారత ఆధ్యాత్మిక గురువు సద్గురు జగదీశ్ వాసుదేవ్ పిలుపునిచ్చారు. భారత్, చైనా, పాకిస్థాన్, నేపాల్, భూటాన్‌లతో ఈ హిమాలయ బోర్డు ఏర్పాటు కావాలన్నారు. ఖాట్మండులో జరిగిన ‘ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేపాల్ ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఈ విషయాన్ని ఈషా పౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

చైనా-నేపాల్ సరిహద్దు సమీప ప్రాంతాలను భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో వందలాది మంది మరణించగా, ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికుల ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సద్గురు...ఐదు దేశాలతో హిమాలన్ బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. అన్ని దేశాలు పంచుకునే పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ‘పర్వతాలకు మీ రాజకీయ అనుబంధం తెలియదు. మీరు మాట్లాడే భాష ఏమిటో కూడా వాటకి తెలియదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. తక్షణ సహాయక చర్యలకే పరిమితం కాకుండా హిమాలయాల పట్ల లోతైన సాముహిక బాధ్యతను గుర్తించాలని సద్గురు పిలుపునిచ్చారు.