
అమరావతి: మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారని వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జగన్ పై మాటల దాడి ఇప్పటికీ ఆగలేదని అన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల జీవితాల్లో మార్పు తెచ్చింది జగనేనని, పార్టీకి సుదీర్ఘకాలం నాయకత్వం వహించే సత్తా ఉన్న నేత జగన్ ఒక్కరే అని కొనియాడారు. కావాలనే వ్యక్తిగతంగా జగన్ ను టార్గెట్ చేస్తున్నారని, కొంతమంది వ్యక్తి హననం చేస్తుంటారని విమర్శించారు. వైసిపిని విమర్శించే విషయంలో పాత్రలు మాత్రమే మారుతున్నాయని, వారి వారి వ్యక్తిగత కారణాలతో కొందరు పార్టీ నుంచి వెళ్లారని తెలియజేశారు.
ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే జగన్, వైసిపిపై విమర్శలు చేస్తున్నారని, అటెన్షన్ కోసమే విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసిపి వీడిన వారిపై తాము ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయలేదని, 40 ఏళ్లుగా జగన్ వెంట ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. పార్టీ నుంచి వెళ్లిన వారి గురించి జగన్ ఎప్పుడూ నెగెటివ్ గా మాట్లాడలేదని, జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారని విజయసాయిరెడ్డి అనడం దారుణం అని, సొంత కారణాలతతోనే విజయసాయిరెడ్డి వైసిపి నుంచి బయటకు వెళ్లారని సజ్జల పేర్కొన్నారు. అన్ని వర్గాల మనసులు గెలుచుకున్న వ్యక్తి జగన్ అని పార్టీలో సాయిరెడ్డికి జగన్ అత్యున్నత స్థానం ఇచ్చారని అన్నారు. సాయి రెడ్డి చేసిన ఆరోపణలతో తమ పార్టీలో అపోహలు రావొచ్చు.. అందుకే ఈ వివరణ అని తెలిపారు. వైసిపికి కర్త,కర్మ క్రియ జగనేనని, వైసిపి అంటే కోటరీ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేకుంటున్నారని అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలకు అద్దం పట్టేలా వైసిపి రూపుదిద్దుకుంటుందని, మానవీయ కోణానికి వైసిపి అత్యంత ప్రాధాన్యమిస్తుందని ప్రశంసించారు.
వైసిపిలో జగనే నెంబర్-1 మేమంతా కార్యకర్తలమని, విజయసాయికి జగన్ నెంబర్ 2 స్థానం కల్పించారని అన్నారు. పార్టీలో జగన్-2, సజ్జల నెంబర్-1 అని సాయిరెడ్డి అనడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ విజన్ కు అనుగుణంగా తాము పనిచేస్తాం.. అదే మా బాధ్యత అని స్పష్టం చేశారు. సాయిరెడ్డితో ఉన్న అనుబంధంతో జగన్ ఆయనకెప్పుడూ ప్రత్యేక స్థానమిచ్చారని, వైసిపిలో ఉన్నప్పుడు విజయసాయికి మంచి పదవులే వచ్చాయని అన్నారు. ఎంపిగా, జాతీయ కార్యదర్శిగా ఇలా ఎన్నో అవకాశాలు విజయసాయికి జగన్ ఇచ్చారని, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని గతంలో సాయిరెడ్డి చెప్పారని, ఎవరితో సమస్యలు లేవని రాజీనామా సమయంలో సాయిరెడ్డి చెప్పారని అన్నారు.
కోటరీలో జగన్ బంధీ అయితే తక్కువ సమయంలోనే వైసిపి అధికారంలోకి వచ్చేదా? అని సజ్జల ప్రశ్నించారు. వైసిపిలో విజయసాయికి వచ్చినన్ని పదవులు ఎవరికీ రాలేదని, జగన్ లేనిదే వైసిపికి అర్థం లేదు..పార్టీకి దారీతెన్ను లేదని అన్నారు. తనకు, తన పార్టీకి ప్రచారం కోసమే సాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, తనకు అన్యాయం జరిగిందని విజయసాయిరెడ్డి అంటున్నారని ధ్వజమెత్తారు. జగన్ పై విమర్శలు చేస్తే పబ్లిసిటీ వస్తుందని సాయిరెడ్డి అనుకుంటున్నారని, ఇష్యూస్ ను డైవర్ట్ చేయడం, పబ్లిసిటీ పొందడం.. ఇదే వాళ్ల అజెండా అని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకుంటే ప్రజా సమస్యలు పక్కకెళ్లిపోతాయని, వైసిపి వల్లే విజయసాయిరెడ్డి గురించి ప్రజలకు తెలిసిందని అన్నారు. తనకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నారని, పార్టీ పెట్టాలని విజయసాయిరెడ్డి అనుకుంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని, వ్యక్తి గతంగా తాము ఎలా ఉన్నా..పార్టీ వల్లే వారందరికీ గుర్తింపు వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి సొంతంగా రాజకీయాలు చేసుకోవచ్చునని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.











