
మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: ‘బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణే తమ లక్ష్యం’ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో పార్టీని ఏర్పాటుచేశానని తెలిపారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో ఐదుకు ఐదు సీట్లు గెలుస్తామని ప్రకటించారు. పార్టీ ఏర్పాటు అనంతరం తొలిసారి నిజామాబాద్ వచ్చిన కవితకు ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలుచేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్‌ను ప్రశ్నించాల్సిన బీఆర్‌ఎస్ కూడా మౌనం వహిస్తోందని విమర్శించారు.
వేముల ప్రశాంత్‌రెడ్డిని క్షమించను...
బీఆర్‌ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిపై కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను, తన తండ్రి కేసీఆర్‌ను రాజకీయం గా దెబ్బతీయడంలో ఆయనదే ప్రధాన పాత్ర అని ఆరోపించా రు. తండ్రిని, బిడ్డను విడదీసిన కుట్రలో ప్రశాంత్‌రెడ్డి కీలక పా త్ర పోషించారని ఆమె ఆరోపించారు. ప్రశాంత్‌రెడ్డికి నా ఉసు రు తగులుతుందని అన్నారు. హరీశ్‌రావును క్షమించవచ్చేమో కానీ ప్రశాంత్‌రెడ్డిని మాత్రం క్షమించబోనన్నారు. వచ్చే ఎన్నికల్లో బాల్కొండలో ఆయనను ఓడిస్తామని వ్యాఖ్యానించారు.
కన్నీళ్లు పెట్టిన కవిత
తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న కవిత భావోద్వేగానికి గురయ్యారు. పుట్టినింటి నుంచి మెట్టిన ఇంటికి వచ్చాను. పుట్టింటి వారు వెళ్లగొడితే.. అత్తింటి వారు అక్కున చేర్చుకున్నా రు. సొంతగడ్డకు వచ్చిన ఆనందంతో కన్నీళ్లు ఆగడం లేదు అం టూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉద్యమంలో పనిచేసిన తనను తీ హార్ జైల్లో పెట్టినా ధైర్యం కోల్పోలేదని చెప్పారు. ఈడీ, సీబీఐ విచారణలు ఎదుర్కొన్నా తాను తప్పు చేయలేదని స్పష్టం చేశా రు. పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసి జైలుకు వెళ్లానని నాయకులే చెప్పిన తర్వాత తనను పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపించాల్సి వచ్చిందో ప్రజలు ఆలోచించాలని కోరారు.
ప్రజలే మా బలం
పాంచజన్య స్ఫూర్తితో ఐదు కీలక అంశాలపై తమ పార్టీ పనిచేస్తుందని కవిత తెలిపారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం, యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం, భూమిలేని పేదలకు భూమి వంటి అంశాలను ప్రస్తావించారు. బీడీ కార్మికులు, రైతులు, మైనార్టీల సమస్యలపై పోరాడుతామని చెప్పారు. మాధవ్‌నగర్ వంతెన నిర్మాణం ఆలస్యంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను ప్రశ్నించారు. పసుపు బోర్డుతో రైతులకు ఏ మేరకు ప్రయోజనం కలిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌పై పోరాటం చేస్తూనే తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేస్తామని, ప్రజలే తమ బలమని కవిత స్పష్టం చేశారు.











