హైదరాబాద్: హైదరాబాద్‌ విశ్వనగరంగా మారిందని.. ప్రపంచంతో పోటీ పడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను మూడు విభాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని సిఎం అన్నారు. సోమవారం సిఎం రేవంత్ అంబర్ పేట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మూసారాంబాగ్‌లో మూసీ నదిపై కొత్తగా నిర్మించి హైలెవల్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. తర్వాత అంబర్ పేటలోని జిహెఎంసి స్పోర్ట్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజ్ గిరి.. మూడు కార్పొరేషన్ల కొత్త లోగోలను రేవంత్ ఆవిష్కరించారు.

అనంతరం సిఎం మాట్లాడుతూ.. "అంబర్‌పేట నియోజకవర్గంలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. మూసీ పక్కన నివసించే పేదలను చూడలేని పరిస్థితి. కాస్త వర్షం పడితే చాలు బ్రిడ్జిపైనుంచి నీరు ప్రవహిస్తుంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఈ వంతెనను ఎందుకు కట్టలేదు. గత సర్కారు అంబర్‌పేటలో ఒక్క డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టలేదు" అని విమర్శించారు.

హైదరాబాద్‌ మహా నగరం గొప్పగా అభివృద్ధి చెందుతోందని... అన్ని వర్గాల వారికి ఈ నగరం ఆశ్రయమిచ్చిందన్నారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు పెరగడం లేదన్నారు. ప్రణాళికబద్ధంగా తెలంగాణలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని సిఎం రేవంత్ చెప్పారు.