బిష్కెక్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలకు తక్షణమే ముగింపు పలకాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ‘అంతులేని యుద్ధం నుంచి యుద్ధానికి ముగింపు దిశగా సాగాలి’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కోరారు. ఈ వివాదానికి శాంతియుత పరిష్కారం కనుగొనడం యావత్ మానవాళి ఉమ్మడి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) సదస్సు సందర్భంగా పుతిన్‌తో మోదీ సోమవారంనాడు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు నాలుగేళ్లు పూర్తవుతున్నప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్న నేపథ్యంలో మోడీ-పుతిన్ మధ్య ఈ కీలక భేటీ జరిగింది.

మానవాళి సంక్షేమం కోసం యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సమస్యలకు త్వరగా శాంతియుత పరిష్కారం లభించాలన్నదే మానవాళి ఆకాంక్ష అని, అదే భారతదేశ సందేశం అని మోడీ అన్నారు. భారత్ శాంతి మార్గాన్ని గుర్తుచేస్తూ, గాంధీ పుట్టిన నేల, బుద్ధిని నేల రెండు ఒకే సందేశాన్ని పంచుకుంటాయని, ఆ సందేశం శాంతిమార్గమని అన్నారు. శాంతి కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుదని మోడీ స్పష్టం చేశారు.

యుద్ధమనేది మానవాళిని ప్రతిరోజూ వెనక్కి నెడుతుందని, అదే సమయంలో శాంతి వైపు వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశ, కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని మోడీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పుతిన్‌ను భారత్‌లో జరుగనున్న బ్రిక్స్ సదస్సుకు కూడా హాజరుకావాలని మోడీ ఆహ్వానించారు. భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ సదస్సుకు పుతిన్‌తో పాటు ఆయన ప్రతినిధి బృందానికి స్వాగతం పలికేందుకు భారతీయులంతా ఎంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. గత ఏడాది పుతిన్ భారత్ పర్యటన తర్వాత మోదీ-పుతిన్‌లు ప్రత్యక్షంగా కలుసుకున్న సందర్భం ఇదే కావడం విశేషం.