
జ్యూరిచ్ (స్విట్జర్లాండ్): 'రేవ్' పార్టీ వద్ద గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగ గాయపడ్డారు. ఈ ఘటన స్విట్జర్లాండ్ ఉత్తర ప్రాంతంలోని ఆరౌ నగరంలో చోటుచేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ కాల్పుల్లో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది పోలీసులు ఆదివారం తెలిపారు.
స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు, వైద్య బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.











