
రాహుల్‌గాంధీ స్వయంగా వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి బొంద పెట్టారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవా రం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు లు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడంతో పాటు 500 బోనస్ ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటిస్తే రేవంత్‌రెడ్డి మాత్రం రాహుల్‌గాంధీ పుట్టినరోజే కేంద్ర సర్కార్ నిర్ణయించిన ఎంఎస్పీ ప్రకారమే కొంటామని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర క్యాబినెట్ సమావేశ అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర పంటలు మాత్రమే కొంటామని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు.మిగతా పంటలు రైతులు దళారులను అమ్ముకొని నష్టపోవాలా అని మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు అన్నిరకాల పంటలకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని మాయమాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారన్నారు.అలాగే పప్పు దినుసులతో పాటు నూనె పంటలను 25 శాతమే కేంద్రం కొనుగోలు చేస్తుందని మిగతా 75 శాతం పంట తక్కువ ధరకు దళారులకు అమ్ముకొని రైతులు నష్టపోవాలా అని ప్రశ్నించారు. ఎకరానికి రెండు యూరియా బస్తాలే ఇస్తామని కొత్తగా యాప్ పెట్టి, సర్క్యులర్ జారీచేసి ఆ రెండు బస్తాల కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పోలీసు బందోబస్తు మధ్య పోలీస్ స్టేషన్లలో యూరియా పంచడం అత్యంత దారుణన్నారు. ఎన్నికల ముందు అన్ని పంటలకు ఇస్తామని మాయమాటలు చెప్పారన్నారు. 33 రకాలకు బోనస్ ఇస్తామని ఇప్పుడేమో 7 రకాలకు కుదించారన్నారు.రైతుల ఖాతాల్లో 45 రోజుల్లో 9 వేల కోట్ల రైతుబంధును వేస్తామని సిద్దిపేట నియోజకవర్గం నర్మెట్ట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో చెప్పిన రేవంత్‌రెడ్డి 90 రోజులు గడుస్తు న్నా ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
రైతుబంధు వేసినప్పుడల్లా ఒక సమావేశం నిర్వహించి గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో వరి విపరీతంగా పండుతుందని 2021-22లో కేసీఆర్ హ యాంలో రికార్డు స్థాయిలో 92 లక్షల టన్నులు పండితే, కేంద్రం కొనకపోయినా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి కొనుగోలు చేసిందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం రైతుల ప ట్ల దారుణంగా వ్యవహరిస్తూ తడిగుడ్డతో గొంతు కోస్తుందన్నారు.
రైతులకు రూ.29,358 వేల కోట్ల రైతుబంధు బాకీ పడిందన్నారు. రైతు బీమా ఆగలేదని బరాబర్ పడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు మాట్లాడటం సరికాదన్నారు. జనవరి నుం చే రైతుబీమాను బంద్ చేశారని ఆరోపించారు. దీంతో 7,600 మంది చనిపోయిన రైతు కు టుంబాలకు రైతు బీమా అందలేదన్నారు.












