మన తెలంగాణ/హైదరాబాద్: ఫిక్కీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వరంగల్‌లో ఎగుమతులపై వర్క్‌షాప్ నిర్వహించారు. హైదరాబాద్ కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ పి.సతీష్ మాట్లాడుతూ, కస్టమ్స్ శాఖ పన్నుల వసూలు సంస్థ నుంచి అంతర్జాతీయ వ్యాపార ప్రోత్సాహకంగా మారిందని తెలిపారు. ఇసీలింగ్, ఇవే బిల్ వంటి డిజిటల్ విధానాల వల్ల 90% దిగుమతులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సులభంగా జరుగుతున్నాయని తెలిపారు. ఫిక్కీ ప్రతినిధులు పి.ఎస్.ప్రుథి, ఎస్.విజయలక్ష్మి మాట్లాడుతూ, ఎటిఎ కార్నెట్ (వస్తువుల పాస్‌పోర్ట్), యుఎన్ టిఐఆర్ వ్యవస్థల ద్వారా ప్రదర్శనలు, తాత్కాలిక సరుకుల రవాణాకు పన్ను మినహాయింపు లభిస్తుందని వివరించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బి.రవీందర్ రెడ్డి మిర్చి, మామిడి ఎగుమతుల అవకాశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం. వేద ప్రకాశ్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.