
ఫిరోజ్‌పూర్ (పంజాబ్): పంజాబ్‌లో ఓ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఫిరోజ్‌పూర్‌లో గుర్తు తెలియని దుండగులు.. ఆప్ నేత గుర్ ప్రీత్ సింగ్(అలియాస్ గోపి) ను కాల్చి చంపారని పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. జిల్లాలోని మామ్‌డోట్ పట్టణంలో గోపి, 22 ఏళ్ల హర్‌ప్రీత్ అలియాస్ హ్యాపీతో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.
కారులో వచ్చిన నలుగురు దుండగులు ప్రధాన మార్కెట్ వద్ద వాహనం దిగి, గోపీ, హర్‌ప్రీత్‌లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గోపిని వెంటనే సివిల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు, హర్‌ప్రీత్‌ను చికిత్స కోసం లూథియానాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.











