న్యూఢిల్లీ : ప్రభుత్వ సంస్థల్లో యాజమాన్య వాటాను తగ్గించుకుని నిధులుగా మలుచుకునే డిజిన్వెస్ట్‌మెంట్ (పెట్టుబడుల ఉపసంహరణ) లక్ష్యాన్ని కేంద్రం 78 శాతం పూర్తి చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్, అస్సెట్ మోనెటైజేషన్ (ఆస్తుల నగదీకరణ) లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం కేవలం 5 నెలల్లోనే సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం మొత్తం రూ.80,000 కోట్ల లక్ష్యాన్ని బడ్జెట్‌లో నిర్దేశించుకోగా, ఇప్పటివరకు రూ.62,124 కోట్ల మూలధనాన్ని సేకరించింది. సేకరించిన మొత్తం నిధులలో రూ.55,757 కోట్లు 9 ప్రభుత్వ రంగ సంస్థల్లో (పిఎస్‌యు) మైనారిటీ వాటాల విక్రయం, ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఎంపిసిఎల్) వ్యూహాత్మక విక్రయం, ఎస్‌యుయుటిఐ నుండి వచ్చిన నిధుల ద్వారా లభించాయి. దీంతో పాటు ఇన్విట్స్ ద్వారా అస్సెట్ మోనెటైజేషన్‌తో మరో రూ.6,367 కోట్ల ఆదాయం సమకూరింది.

ఎల్‌ఐసిదే అత్యధిక వాటా

ఈ విక్రయాల ప్రక్రియలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. ఎల్‌ఐసిలోని 6.5 శాతం వాటాను ఉపసంహరించుకోవడం ద్వారా ప్రభుత్వం ఒక్కసారిగా రూ.31,515 కోట్ల నిధులు సమీకరించింది. ఇది ఈ ప్రక్రియ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో సగానికి పైగా కావడం గమనార్హం. వీటితో పాటు కోల్ ఇండియాలోని 2 శాతం వాటా విక్రయం ద్వారా రూ.5,542 కోట్లు, ఎన్‌హెచ్‌పిసి లోని 6.01 శాతం వాటా ద్వారా రూ.4,357 కోట్లు, హిందూస్థాన్ కాపర్‌లో 6 శాతం వాటా అమ్మకం ద్వారా రూ.3,041 కోట్లు ప్రభుత్వం సమీకరించింది. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్‌ఎల్‌సి ఇండియా, జిఐసి, ఐఆర్‌ఎఫ్‌సి, కొచిన్ షిప్‌యార్డ్ వంటి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా ప్రభుత్వం తన వాటాలను తగ్గించుకుంది.

ఐడిబిఐ బ్యాంక్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదన

ఐడిబిఐ బ్యాంక్ వ్యూహాత్మక విక్రయ ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన విక్రయ ప్రయత్నం విఫలమైనప్పటికీ, దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్ ఎన్‌డిబి, ప్రేమ్ వత్స నేతృత్వంలోని ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ సంస్థల నుండి నవీకరించిన బిడ్లు వచ్చినట్లు సమాచారం.

బడ్జెట్ అంచనాలను మించిన వ్యయం

ఇంధనం, ఎరువుల దిగుమతి బిల్లులు పెరగ డం వల్ల ప్రభుత్వ వ్యయం బడ్జెట్ అంచనాలను మించే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తాజా నిధుల సేకరణ ప్రభుత్వానికి ఎంతో ఊరట కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సం వత్సరానికి ప్రభుత్వం జిడిపిలో 4.3 శాతాన్ని ద్రవ్య లోటు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభు త్వం 2023-24 సవరించిన అంచనాల నుం డి ప్రత్యేక డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను నిర్దేశించడం నిలిపివేసి, వాటిని ’మిసలేనియస్ క్యాపిటల్ రిసీప్ట్’ కింద బడ్జెట్‌లో చేర్చడం ప్రారంభించింది. గతంలో రీవైజ్డ్ అంచనాల ప్రకారం 2023-24 లో రూ.30,000 కోట్లు, 2024-25 లో రూ.33,000 కోట్లు, 2025-26 లో రూ.33,837 కోట్లు కేటాయించగా, ప్రస్తుత 2026-27 బడ్జెట్ అంచనాల్లో ఆ మొత్తాన్ని రూ.80,000 కోట్లుగా నిర్ణయించారు.