
హైదరాబాద్: కొత్త కారు కొన్న ఓ కుటుంబంలో సంతోషం కొద్ది సేపు కూడా ఉండకుండానే విషాదంగా మారింది. పూజ పూర్తి కాగానే కారును ముందుకు తీయడంతో దాని కిందపడి వృద్ధుడు మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని పెద్దమ్మ గుడి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మియాపూర్‌కు చెందిన సాయికుమార్ కొత్త కారు కొన్నాడు. సాయికుమార్ మేనమామ ఎపి రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ, తుమ్ములపల్లికి చెందిన రామచంద్రరావు(70) భార్య ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రిలో చూపించేందుకు హైదరాబాద్‌కు వచ్చారు.
ఈ క్రమంలోనే మేనల్లుడు కారు పూజ చేయించాలని వారిని తీసుకుని శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడికి తీసుకుని వచ్చాడు. గుడి వద్ద అర్చకులు కొత్త కారుకు పూజ చేశారు. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత కారు కొద్దిగా ముందుకు కదపాలని పూజారీ సూచించడంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న సాయికుమార్ కారును స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశాడు. అయితే బ్రేక్‌కు బదులుగా ఎక్సలేటర్‌పై కాలు గట్టిగా వేయడంతో ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. అప్పటికే కారు ముందు భాగంలో ఉన్న రామచంద్రరావు గట్టిగా ఢీకొట్టడంతో ఎగిరి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఏఐజి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామచంద్రరావు శనివారం మృతిచెందాడు.
కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కావాలని చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పెద్దమ్మ గుడిలో ఉన్న సిసి కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.










