చెన్నై: మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.శివజ్ఞానం నేపాల్‌లో ఆగస్టు 26 నుంచి అదృశ్యమైనట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు మద్రాస్ బార్ అసోసియేషన్ (ఎంబిఎ) సోమవారంనాడు తెలియజేసింది. తక్షణం జోక్యం చేసుకువాలని కోరింది. నేపాల్‌లో సంభవించిన భారీ వరదల అనంతరం ఆయన కనిపించకుండా పోయినట్టు సమాచారం ఉందని తెలియజేసింది. విపత్తు సంభవించిన సమయంలో జస్టిస్ శివజ్ఞానం తమిళ యాత్రికుల బృందంతో కలిసి నేపాల్‌లో పర్యటిస్తున్నారని ఎంబిఎ ఆఫీస్‌బేరర్ ఒకరు తెలిపారు.

‘ఈ అత్యంత క్లిష్ట సమయంలో జస్టిస్ శివజ్ఞానం కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఆయన ఆచూకీ కనుగొని సురక్షితంగా తిరిగి తీసుకురావడంతో భారత ప్రభుత్వం సమన్వయంతో, వేగంగా, నిరంతరం చేపట్టే చర్యలు ఎంతో కీలకమైన సహాయన్ని అందించగలవు’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో కూడా బార్ అసోసోయేషన్ పేర్కొంది. జస్టిస్ శివజ్ఞానం కోసం గాలించి, రక్షించేందుకు ఉన్న అన్ని అవకాశాలు వినియోగించాలని, ఆ ప్రక్రియలో సాధించిన పురోగతిని ఆయన కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఎంబిఎ కోరింది. జస్టిస్ శివజ్ఞానం న్యాయవ్యవస్థలో 34 ఏళ్ల పాటు సేవలందించారు. 2025 జూలై నుంచి ఆయనను సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా నియమించింది.