ఖాట్మండూ: నేపాల్‌ను అతలాకుతులం చేసిన మెరుపు వరదల్లో మృతుల సంఖ్య సోమవారం నాటికి 903కు చేరింది. మృతదేహాల వెలికితీత కొనసాగుతుండగా, మరో 4,247 మంది ఇప్పటికీ గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. ఇంతవరకూ చిత్వాన్‌లో 272, నావల్‌పరాసి ఈస్ట్‌లో 207, నావల్‌పరాసి వెస్ట్‌లో 151, గోర్ఖా జిల్లాలో 62 మృతదేహాలను వెలికితీసినట్టు జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ సంస్థ (ఎన్‌డిఆర్‌ఆర్‌ఎంఏ) ప్రకటించింది. నువాకోట్‌లో 95, ధాదింగ్‌లో 55, తనహులో 37, రసువాలో 24 మృతదేహాలు సైతం లభ్యమయ్యాయి. ఈ విపత్తులో 99 మంది భద్రతా సిబ్బంది, 591 మంది విదేశీయులు సహా 4,247 మంది గల్లంతైనట్టు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, కొండచరియలు విరిగిపడి దిగువన ఉన్న బోటేకోషికి చేరుకోవడంతో వరద ప్రవాహం ఊళ్లను ఊళ్లు ముంచెత్తింది. భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. చైనా వైపు కూడా ఈ విపత్తులో 16 మంది మరణించగా, టిబెట్‌లో దాదాపు 550 ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదని చైనా మీడియా చెబుతోంది.

మళ్లీ పొంగుతున్న బోటేకోషి

మరోవైపు, బోటేకోషి నదిలో నీటిమట్టం పెరిగిందని ఎన్‌డిఆర్‌ఆర్‌ఎంఎ హెచ్చరించింది. ఆదివారం వరకూ వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 9,500 మందిని రక్షించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో భారత్, అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, స్పెయిన్, బెల్జియం, జర్మనీ, ఇటలీ, మాల్టా, తుర్కియే, స్విట్జర్లాండ్, పోర్చుగల్ తదితర దేశాలకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నారు. గల్లంతైన తమ బంధువుల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రులకు చేరుకుంటుండటంతో నేపాల్‌లోని ఆసుపత్రుల్లో మృతదేహాలను గుర్తించే ప్రక్రియపైనే అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. కుళ్లిపోయిన మృతదేహాలు, గుర్తించలేని బాధితుల మృతదేహాలను ప్రామాణిక, ఆమోదిత విధానాల ప్రకారం ఖననం చేసినట్టు నేపాల్ విదేశాంగ కార్యదర్శి అమృత్ బహదూర్ రాయ్ తెలిపారు. డీఎన్‌ఏ విశ్లేషణలో నిపుణులైన 18 మంది భారత ఫోరెన్సిక్ నిపుణుల బృందం నేపాల్ చేరుకుందని, ఇరుదేశాల మధ్య సమన్వయం కొనసాగుతోందని చెప్పారు.

ధర్మల్ డ్రోన్‌లతో..

వరదల కారణంగా రసువా జిల్లాలోని రసువాగఢి జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో చిక్కుకుపోయిన 93 మంది కార్మికుల ఆచూకీ కోసం నేపాల్ ఆర్మీ థర్మల్ డ్రోన్‌లతో విసృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ తనిఖీల్లో ఇప్పటివరకూ ఎలాంటి ఫలితం లభించలేదు. డ్రోన్ల ద్వారా లభించిన ప్రాథమిక డాటా ప్రకారం సొరంగంలో ప్రాణాలతో ఉన్న వారి జాడ కానీ, మనుషుల ఉనికి కానీ కనిపించకపోవడంతో నిపుణుల బృందం వెనుదిరిగి వచ్చినట్టు అధికారులు చెప్పారు. ఇంతవరకూ వివిధ హైడ్రో వపర్ సొరంగాల్లో చిక్కుకున్న 279 మందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకురాగా, రసువా, నవాకోట్‌లోని 11 హైడ్రో ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 897 మంది సమాచారం ఇప్పటికీ తెలియలేదని నేపాల్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వెల్లడించింది