
అమరావతి: తనపై నమ్మకద్రోహి అంటూ వైసిపి కోటరీ దుష్ప్రచారం చేస్తోందని మాజీ ఎంపి విజయసాయి రెడ్డి ఆరోపించారు. నమ్మకద్రోహినే అయితే ఆనాడే సజ్జల మాదిరిగా కాంగ్రెస్ తో సంధి చేసుకునేవాణ్ణినని అన్నారు. విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిబిఐ, ఇడి ఛార్జిషీట్లలో తన పేరు లేకుండా చేసుకునేవాణ్ణినని, నమ్మకస్తుణ్ని అనే కారణంతో ప్రతి ఛార్జిషీట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తన పేరు చేర్చిందని తెలియజేశారు. ఇప్పుడు వైసిపిలో నంబర్-2 జగన్, నంబర్-1 సజ్జల అని.. జగన్ 16 నెలలు జైల్లో ఉంటే తనను 15 నెలలు జైల్లో పెట్టారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. నమ్మక ద్రోహం తన రక్తంతో ఉంటే, అప్పుడే అప్రూవర్ గా మారేవాడినని, తనకు సంబంధం లేని లిక్కర్ స్కామ్ లోనూ తనను ఎ-5గా చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాకినాడ సిపోర్టు కేసులో తనను ఎ-2 గా చేర్చారని, సకల శాఖల మంత్రి పేరు మాత్రం ఇంతవరకు ఏ ఛార్జిషీట్ లోనూ లేదని మండిపడ్డారు. ఏ కేసులూ లేకుండా ఎలానో కోటరీ నాయకుడికి తెలిసినంత తనకు తెలియదని, తాను ఏనాడు నమ్మక ద్రోహం పనులు చేయలేదని అన్నారు. పార్టీ మారేందుకు సిద్ధమైన ఉత్తరాంధ్ర నేతతో కలిసి కోటరీ నాయకుడు కుట్ర పన్నారని, తనపై అసత్యాలు చెప్పి ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారని జగన్ మెప్పు కోసమే నాస్తికుడిగా చెప్పుకున్న ఇతను వైసిపి కాదని.. రాష్ట్రానికే నమ్మకద్రోహి అని ధ్వజమెత్తారు. తన ఆత్మగౌరవానికి 2020 నుంచి భంగం కలిగిందెవరు? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల విజయం తర్వాత సజ్జల ప్రమేయం ఎలా శృతి మించిందని, సకల శాఖమంత్రిగా సజ్జల జగన్ ను ఎవరు కలవకుండా గోడ కట్టింది సజ్జల కాదా? అని జగన్ ను నమ్మి పనిచేసే సీనియర్లు, కార్యకర్తలు 2029లో పార్టీ ఓడితే రిటైరేనా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.











