నేటితో ముగియనున్న లాటరీ ప్రక్రియ

మన తెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ ప్రక్రియ మూడవరోజూ విజయవంతంగా ముగిసింది. శేరిలింగంపల్లి, మేడ్చల్, మలక్ పేట, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు చెందిన లాటరీని ఆయా నియోజకవర్గాల్లో ఆదివారం నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గంలో 480 ఇండ్లు చొప్పున నాలుగు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1920 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. లాటరీలో ఇల్లు వచ్చిన అబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ సొంత ఇంటి కలలు నిజం చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల సమక్షంలో, హౌసింగ్ బోర్డ్ అధికారులతో పాటు పోలీసు, రెవిన్యూ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఈ లాటరీ ప్రక్రియ సాగింది. ఆదివారం వరకు 12 నియోజకవర్గాల్లో ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ పూర్తికాగా, సనత్ నగర్, మహేశ్వరం, మల్కాజి గిరి, కార్వాన్ నియోజకవర్గాల్లో సోమవారం లాటరీ ప్రక్రియ జరుగుతుందని హౌసింగ్ బోర్డ్ అధికారులు ప్రకటించారు. దీంతో లాటరీ ప్రక్రియ ముగుస్తుందని వెల్లడించారు.

ఆ నాలుగు నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తుల స్వీకరణ

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకంలో భాగంగా హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పరిధిలో లక్ష ఇండ్లను నిర్మించాలన్న లక్ష్యంతో, పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఇండ్లను నిర్మించాలని సంకల్పించింది. దీనిలో భాగంగా ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో దరఖాస్తులు స్వీకరించి ఇండ్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టింది. ఈ పదహారు నియోజకవర్గాలు కాకుండా గోషామహల్, ఎల్బీనగర్, ముషీరాబాద్, చంద్రాయణగుట్ట నియోజకవర్గాల ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లోని ప్రజలు సెప్టెంబర్ మూడు వరకు మీసేవ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చని హౌసింగ్ బోర్డ్ పేర్కొంది. సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.