
అమెరికా, ఇరాన్ డీల్ సంతకాల తడి ఆరకముందే తిరిగి పశ్చిమాసియాలో భీకర పోరు పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ బెదిరింపులు, ఇప్పటి తాత్కాలిక ఫ్రాన్స్ సంతకాలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ రాత్రికి రాత్రే లెబనాన్‌లోని హెజ్బోల్లా స్థావరాలను ఎంచుకుని దాడులకు దిగింది. బీరూట్ ఇతర ప్రాంతాలలో ఇజ్రాయెల్ శక్తివంతమైన సైనిక వైమానిక దాడులతో 15 మంది చనిపోయారు. దీనితో తిరిగి పశ్చిమాసియాలో తిరిగి యుద్ధ వాతావరణం వేడెక్కింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో శనివారం జరగాల్సిన ఒప్పందం కార్యాచరణ అమలు కీలక చర్చలు నిలిపిపోయాయి. ట్రంప్ తన తరఫున ఉపాధ్యక్షులు జెడి వాన్స్‌ను ఇతర దూతలను అక్కడికి వెళ్లాలని ఆదేశించారు. అయితే కీలక సంతకాల ప్రక్రియ కొనసాగింపును దెబ్బతీస్తూ ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడికి దిగింది. ఈ ఘటనపై ట్రంప్ స్పందించారు.
ఇజ్రాయెల్ చర్యపై వెంటనే స్పందించలేదు. అయితే శాంతి కుదిరితే అది తన ఖాతాలోకి వస్తుందని, ఇటువంటి జరిగితే ఇదిగో ఆయన (వాన్స్) అకౌంట్లోకి పడేలా చేస్తే మంచిదని చమత్కరించారు. ఇరాన్ అమెరికా మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందం ప్రాధమిక అవగాహనతో తమకు ఎటువంటి సంబంధం లేదని, లెబనాన్‌లోని హెజ్బోల్లా ఏరివేతలే తమ తుది లక్షం అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చెపుతూ వచ్చారు. ఈ క్రమంలోనే దాడులు జరిగాయి. ఒప్పందంపై ఫ్రాన్స్‌లో ట్రంప్ , పరోక్షంగా గఇరాన్ అధ్యక్షులు ,పాక్ ప్రధాని సంతకాలు ముందుగానే జరిగాయి. జెనీవా చర్చలకు అంతా ఆసక్తితో ఎదురుచూశారు. ఒప్పందం అమలు కోసం 60 రోజుల కార్యాచరణ తరువాతి దశల్లో పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కీలక అంశాలుగా జెనీవాలో శనివారం కీలక చర్చలు జరగాల్సి ఉంది. అయితే ఇజ్రాయెల్ దాడులతో ఇది అర్థాంతరంగా వాయిదా పడింది. తిరిగి జెనీవా నుంచి శాంతి చర్చల ప్రక్రియ ఎప్పుడనేది చెప్పలేమని దౌత్యవర్గాలు తెలిపాయి.ఇప్పటికైతే ఇది మూలకు పడ్డట్లే అని అమెరికా దౌత్యవర్గాలు తెలిపాయి.
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం సంతకాల ప్రక్రియలో భాగంగా ఘర్షణలను వెంటనే లెబనాన్‌లోని హెజ్బోల్లా స్థావరాలపై దాడులు సహా నిలిపివేయానే అంశం చేర్చారు. అయితే ఇజ్రాయెల్ నుంచి దీనికి సమ్మతి స్పష్టత లేకపోవడం కీలక పరిణామం అయింది. తమ నిరసనను, డీల్‌కు ప్రతిఘటనను తెలియచేసేందుకే ఇజ్రాయెల్ తెల్లవారుజామునే , ప్రత్యేకించి జెనీవాలో చర్చలకు ముందు దాడులు ఉధృతం చేసినట్లు వెల్లడైంది. ఈ దాడులు ఎక్కువగా పౌర ప్రాంతాలపై జరిగాయని ఆందోళన వ్యక్తం అయింది. అయితే తాము హెజ్బోల్లా లక్షంగా దాడికి దిగామని ఇజ్రాయెల్ సేనలు ప్రకటించాయి.హెజ్బోల్లా ముప్పు పూర్తిగా తొలిగిపోతేనే తాము దక్షిణ లెబనాన్ నుంచి వెనకకు వెళ్లుతామని, ఇజ్రాయెల్ జాతీయ భద్రతా కోణం, తమ దేశ భవిత కీలకం అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటిస్తూ వస్తున్నారు. ఇరుపక్షాల మధ్య సంధి కుదిరితే అది వారి సంబంధిత విషయం అవుతుంది. తమ ప్రస్తావన లేకుండా తమతో సంబంధం లేకుండా చర్చలు జరిగి, డీల్ కుదుర్చుకుంటే తాము అంగీకరించడం కుదురుతుందా? అని ఇజ్రాయెల్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
హర్మూ జ్ నుంచి నౌకల కదలికలకు బ్రేక్?
ఫ్రాన్స్‌లో హడావిడి సంతకాల తరువాత ట్రంప్ ఇక హర్మూజ్ తెరుచుకున్నట్లే అని ప్రకటించారు. ఇరాన్‌పై ఆంక్షలు దశలవారిగా తీసివేస్తామని తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా, సంబంధిత లావాదేవీలు క్లియర్ అవుతాయని చెప్పారు. దీనితో వెంటనే ఇరాన్ కూడా దీనికి నిర్థారణ ప్రకటన వెలువరించింది. దీనితో హర్మూజ్ మీదుగా అసంఖ్యాక నౌకలు రాకపోకలకు దిగాయి. దీనితో ఈ ప్రాంతం అంతా సందడిగా మారింది. అయితే ఇప్పుడు తిరిగి ఎటువంటి పరిణామాలు జరగవచ్చు? తక్షణ శాంతి పునరుద్ధరణ సాధ్యం కాలేదనే వార్తలతో , జెనీవా రౌండ్ చర్చలలో ప్రతిష్టంభన తలెత్తడంతో హర్మూజ్ నుంచి నౌకా రవాణా సాగుతుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.












