
ముగ్గురు మృతి, మరి కొందరి పరిస్థితి విషయం
శిథిలాల కింద 30 నుంచి 50 మంది విద్యార్థులు
ఆదివారం కావడంతో గదులకే పరిమితమైన స్టూడెంట్లు
శిథిలాల కింద నుంచి ఫోన్లలో సాయం కోసం వేడుకోలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లలోని ‘సత్య నికేతన్’ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇరుకైన సందులో ఉన్న 50 ఏళ్ల నాటి ఐదు అంతస్తుల భవనం కూలిపోయింది. ఢిల్లీ యూనివర్శిటీ సౌత్ క్యాంపస్‌కు ఎదురుగా ఉండే ఈ భవనంలో బాలుర హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సమాచారం అందగానే ఢిల్లీ పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఢిల్లీ అగ్నిమాపక శాఖ, డీడీఎంఎ బృందాలు, ఫైర్ టెండర్లు, క్యాట్స్ అంబులెన్సులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారనే దానిపై వెంటనే స్పష్టత రాలేదు. అయితే శిథిలాల కింద 40 నుంచి 50 మంది విద్యార్థులు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఆదివారం కూడా కావడంతో ఎక్కువ మంది హాస్టల్ గదికే పరిమితమైనట్టు తెలుస్తోంది.
శిథిలాల కింద నుంచి ఇంతవరకూ ఆరుగురిని వెలికి తీశామని, ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికి ఇద్దరు మృతి చెందారని పోలీసులు తెలిపారు. భవనంలో బేస్‌మెంట్‌తో పాటు పైభాగంలో ఐదు అంతస్తులు ఉన్నాయి. భవనం బేస్‌మెంట్‌లో మరమ్మతులు జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కూలిపోయిన భవనాన్ని ‘హాస్టల్ డేజ్’గా పిలిచేవారని, దీని యజమాని గురుగ్రామ్‌లో ఉంటున్నారని చెప్పారు.
ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థుల్లో ఎక్కువ మంది కేరళ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని, రహదారికి ఆవల ఉన్న కళాశాలల్లో చదువుతున్నారని స్థానికులు తెలిపారు. భవనం బేస్‌మెంట్‌లో నిర్మాణ పనులు జరుగుతుండటంతో అక్కడ నీరు చేరిందని, భవనం పునాది కూడా బలహీనంగా ఉందని ఛేత్రీ అనే స్థానికుడు తెలిపారు. ఈ ఘటన పనిదినాల్లో జరిగి ఉంటే మరింత విషమంగా ఉండేదని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. వారాతం కావడంతో చాలామంది విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లారని వివరించారు.
శిథిలాల కింద నుంచి ఫోన్ కాల్స్..
ఘటనా స్థలికి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యే అనిల్ శర్మ మాట్లాడుతూ, ఇంకా అనేక మంది భవనం శిధిలాల కింద చిక్కుకున్నారని తెలిపారు. ‘శిథిలాల లోపల చిక్కుకున్న వారి నుంచి మాకు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. లోపల ఉన్నవారితో రెస్క్యూ బృందాలు నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. అందరూ క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. కాగా, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నందున శిథిలాల్లో చిక్కుకున్న, గాయపడిన వారి కచ్చితమైన సంఖ్య తెలియదని, ధ్రువీకరించిన సమాచారం అందిన వెంటనే తదుపరి వివరాలు వెల్లడిస్తామని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
కఠిన చర్యలు తీసుకుంటాం: సీఎం
ఐదంతస్తుల భవనం కుప్పకూలిన సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలను స్వయంగా సమీక్షించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఏ ఒక్కరినీ వదలిపెట్టేది లేదని చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే తమ ముందున తక్షణ ప్రాధాన్యతా క్రమమని తెలిపారు.








