
టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కొత్త రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటివరకూ ఆయన క్రికెటర్‌గా మాత్రమే మనందరికీ పరిచయం. అయితే ఆయన ఇప్పుడు బుల్లితెరపై వ్యాఖ్యాతగా సందడి చేయనున్నారు. బిగ్‌బాస్ బంగ్లా రియాల్టీ షోకి గంగూలీ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. దాదాపు దశాబ్ధకాలం విరామం తర్వాత బిగ్‌బాస్ బంగ్లా ప్రారంభం కానుంది. తొలి సీజన్‌కు మిథున్ చక్రవర్తి, రెండో సీజన్‌కు నటుడు జీత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే సీజన్-3కి గంగూలీ వ్యాఖ్యాతగా అలరించబోతున్నారు.
బిగ్‌బాస్ వ్యాఖ్యాతగా చేయడానికి ఒప్పుకోవడం వెనుక ఉన్న కారణాన్ని గంగూలీ పంచుకున్నారు. ‘‘బిగ్‌బాస్ ఒక వైవిధ్యమైన షో. అందరికీ దగ్గరైన షో. సుదీర్ఘ విరామం తర్వాత బెంగాల్‌లో మళ్లీ మొదలవుతోంది. ఇంతకు ముందు వచ్చిన బిగ్‌బాస్ షోలను రోజూ చూసే సమయం ఉండేది కాదు. వీకెండ్ మాత్రం కచ్చితంగా చూసే వాడిని. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా ఎలా చేశారో బాగా పరిశీలించా. ఇది చేయడం నాకు ఆసక్తికరంగానే ఉంది’’ అన్నారు. ఇక గ్రాండ్ ప్రీమియర్‌కు టీం ఇండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా విచ్చేసి సందడి చేశారు.











