
రండి మిత్రులారా రండి, జ్ఞాపకాల్ని పోగేసుకుందాం రండి
ఎక్కడెక్కడో పోగొట్టుకున్న జ్ఞాపకాల్ని
తిరిగి వెతికి పట్టుకుని ఒకచోట కుప్ప పోసుకుందాం రండి
ఒకానొక చెట్టుకు తేనెపట్టులా ఒదిగిన వాళ్లం
ఎన్నెన్నో మధుర జ్ఞాపకాల్ని తేనెలా కూడబెట్టుకున్నవాళ్లం
ఒక్కసారి ఆ తేనెతుట్టెను కదిలించుకుందాం రండి
ఎన్నెన్నో పూలవనాల్ని గాలించిన వాళ్లం
ఇంకెన్నో ముళ్ల వనాల్ని ఛేదించిన వాళ్లం, ఆశయాల కోసమో
ఆశల కోసమో బతుకును సంకనేసుకుని బయలుదేరిన వాళ్లం
ఎక్కడెక్కడో మన నుండి మనం తప్పిపోయిన వాళ్లం
మనల్ని మనం మరోసారి దొరకబట్టుకుందాం రండి
రండి మిత్రులారా రండి జ్ఞాపకాల్ని పోగేసుకుందాం రండి
ఒక చెట్టును గూడుగా చేసుకుని గడిపిన వాళ్లం
వలస పక్షులమై తలో దిక్కుకి ఎగిరిపోయిన వాళ్లం
ఎవరి స్వార్థ చింతనలో వాళ్లం యంత్రాల్లా మిగిలిపోయుంటాం
మనుషులుగా ఉన్నామో లేదో
ఒక్కసారి మనల్ని మనం గిల్లి చూసుకుందాం రండి
బతుకు బాటలో నదీపాయల్లా చీలిపోయిన వాళ్లం
జీవన పోరాటాల చలి గాలికి వణికిపోతున్న వాళ్లం
అప్పుడప్పుడైనా జ్ఞాపకాల చిదుగుల్ని పోగేసుకుని
మనల్ని మనం వెచ్చబరుచుకుందాం రండి
మనం చేసిన అల్లర్లు, ప్రదర్శించుకున్న ప్రేమలు
దాచిపెట్టుకున్న రహస్యాలు మూగ బాసలు, మౌన ప్రేమలు
ఒకచోట రాశి పోసుకుని సమీక్షించుకుందాం
మనుషులుగా మనల్ని మనం గుర్తుచేసుకుందాం
పెద్దరికాల్ని పక్కన పెట్టి కాసేపు
అల్లరి పిల్లలుగా మారిపోదాం రండి
రండి మిత్రులారా రండి జ్ఞాపకాల్ని పోగేసుకుందాం రండి
స్వార్థం, అసూయ, కుళ్లు కుతంత్రాల రుగ్మతలతో
ప్రేమలు చచ్చి, మమకారాలు పుచ్చి బతికుండగానే చచ్చిన శవాల్లా
కంపు కొడుతున్న మనుషుల మధ్య కాస్తంత మనిషి వాసనేద్దాం రండి
చెడు రక్తంతో కుళ్లిన సమాజం ఒంట్లోకి కొత్త రక్తమై ప్రవహిద్దాం రండి
అనేకానేక కృత్రిమ వాసనల మధ్య కాస్త
స్వచ్ఛమైన మనిషి వాసనేద్దాం రండి
సంసారం, పిల్లలూ, సంపాదన, బరువులూ, బాధ్యతలూ
బంధాలూ, బాధలూ ఎప్పుడూ ఇవే యాంత్రిక్ జీవితాలా
మన బతుకు బాటలో తప్పిపోయిన మధుర జ్ఞాపకాల
పొట్లాలు మరోసారి విప్పి
తలాయిన్ని అనుభూతుల మిఠాయిల్ని పంచుకుందాం రండి
కలుసుకుందాం మనల్ని మనం తెలుసుకుందాం
పెరుగుతున్న వయస్సునూ తరుగుతున్న ఆయిష్షునూ
మర్చిపోయి మళ్లీ కొత్తగా బతుకుదాం రండి
మన వృత్తి బాధ్యతలు కాసేపు పక్కన పెట్టి
మన ప్రవృత్తి మనుషులుగా ఒకరినొకరు
ప్రేమించుకోవటమని ప్రకటిద్దాం రండి
మనమంతా ముందు మనుషులం ఆ తరువాతే ఎవరమైనా
చేస్తున్న పనులేవయినా చేయాల్సిన పనులెన్నున్నా
కలుసుకోవటాన్ని మించిన గొప్ప పనేముంది
మనసుల్ని కలబోసుకోవటాన్ని మించిన గొప్ప కార్యమేముంది
రండి మిత్రులా రండి జ్ఞాపకాల్ని పోగేసుకుందాం రండి
జ్ఞాపకాల్ని పోగేసుకోవటమంటే మానిన మన గాయాల మచ్చల్ని
మనసారా తరుముకోవటం ఆగిపోయిన మన గేయాల్ని
మరోసారి కొత్తగా పాడుకోవటం కాలాన్ని వెనక్కి తిప్పి
మనలోకి కొత్త రక్తాన్ని ఎక్కించుకోవటం, గడిచిన జ్ఞాపకాల ఇంధనంతో
మన బతుకు బండిని సాఫీగా ముందుకు సాగనివ్వటం
మొత్తంగా మనం మనుషులుగా మిగిలిపోవటం
రండి మిత్రులారా రండి జ్ఞాపకాల్ని పోగేసుకుందాం రండి
- చిత్తలూరి











