రెండు ఇళ్ల మధ్య ఉన్న వేపచెట్టు విషయంలో 25 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం చివరికి ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో శనివారం ఉదయం 8 గంటల సమయంలో జరిగిన గొడవలో గొడ్డలి దాడితో ఇద్దరు మృతిచెందారు. ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన భూక్యా పెదబాబు, అతని తమ్ముడు భూక్యా రాము ఇంటి పక్కన ఉన్న వేపచెట్టును కొంతకాలంగా పెట్రోల్ పోసి తగలబెడుతున్నారని అమరబోయిన వెంకటేశ్వర్లు గుర్తించాడు. దీంతో చెట్టును తొలగించే ప్రయత్నంలో భాగంగా వెంకటేశ్వర్లు చెట్టును కొడుతున్న సమయంలో భూక్యా రాము, పెదబాబు అతనిపై గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందాడు. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన పెదబాబు, రాము తండ్రి భూక్యా సైదాపైనా పెదబాబు గొడ్డలి, కర్రతో దాడి చేసినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన సైదాను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఇద్దరి మృతితో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మృతికి కారణమైన అన్నదమ్ములపై దాడి చేసేందుకు గ్రామస్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామస్థులను అదుపుచేసే క్రమంలో ఎస్‌ఐ నవీన్‌కుమార్‌కు తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి సంఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.