
వాషింగ్టన్: హర్మూజ్ జలసంధిలోని కీలక నౌకాయాన మార్గాల్లో ఇరాన్ ఏర్పాటు చేసిన సముద్రపు మైన్లను అన్నింటినీ తొలగించినట్లు అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ గురువారం సాయంత్రం ‘ఎక్స్’లో ఈ మేరకు ప్రకటన చేశారు. హర్మూజ్ జలసంధిలో అమెరికా సైన్యం కీలకమైన మైలురాయిని సాధించిందన్నారు.
ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన సముద్రపు మైన్లను అంతర్జాతీయ నౌకాయాన మార్గాల నుంచి విజయవంతంగా తొలగించామని కూపర్ చెప్పారు. దీంతో జలసంధిలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రవాణా మార్గాలు ఇరాన్ సముద్రపు మైన్ల నుంచి పూర్తిగా విముక్తమయ్యాయని పేర్కొన్నారు.
మైన్ల తొలగింపుతో హర్మూజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలపై ఉన్న ఆంక్షలు, పరిమితులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రపంచ చమురు వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ జలమార్గంలో ఇరాన్‌తో దాదాపు ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా నౌకల రాకపోకలు తీవ్రంగా పరిమితమయ్యాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి.











