మనతెలంగాణ / గండిపేట్:  రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్‌ పరిధిలోని హైదర్‌షాకోట్‌ డివిజన్ సాయిరాం నగర్‌ కాలనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో పార్క్ చేసి ఉంచిన ఐదు బైక్‌లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు విస్తరించడంతో సుమారు ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బైక్‌లలో పెట్రోల్ ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల నుంచి తప్పించుకుని పలువురు సురక్షితంగా బయటకు వచ్చారు.

అయితే.. ఎవరో కావాలనే బైక్‌లకు నిప్పంటించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటి..? ఇది ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక ఎవరైనా కావాలనే నిప్పంటించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సిసి ఫుటేజ్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మూడున్నర సమయంలో వెళ్లినట్లు కనబడుతున్నాయి.