తెలంగాణ అంటే గోదావరి పుష్కరాలు అనేలా ఏర్పాట్లు ఉండాలి

పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి కోట్లు కేటాయించడం హర్షణీయం

: కార్యాలయ ప్రారంభించిన అనంతరం సమీక్షలో మంత్రి కొండా సురేఖ వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి పుష్కరాలు- 2027 నిర్వహణకు సంబంధించి ప్రజాభవన్‌లో ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదివారం ప్రారంభించారు. ప్రభుత్వ శాఖలు, జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు, దేవాదాయ శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక అధికారి కార్యాలయం సమన్వయ కేంద్రంగా పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రజాభవన్ లోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన కార్యాలయం ప్రాంభోత్సవానికి విచ్చేసిన మంత్రిని అర్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛారణతో సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయంలోని సమావేశ మందిరంలో పుష్కరాల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. కార్యాలయంలోని అన్ని సెక్షన్లను దేవాదాయ శాఖ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షణీయం

వచ్చే సంవత్సరం జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే సురక్షితమైన, సౌకర్యవంతమైన పుష్కర యాత్రగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేపడుతోందని మంత్రి సురేఖ తెలిపారు. గోదావరి పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రూ.వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షణీయమని అన్నారు. సరస్వతి నది ఆది, అంత్య పుష్కరాలను ఎంతో వైభవంగా నిర్వహించినట్లే, గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక సమ్మక్క-సారక్క జాతరను రెండుసార్లు విజయవంతంగా చేపట్టినట్లు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు గోదావరి పుష్కరాలు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే గోదావరి పుష్కరాలు అనేలా దేశం నలుమూలలా తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పే విధంగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు వుండాలని అన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు తెలంగాణ ఆతిథ్యం, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం ప్రతిబింభించేలా వసతుల కల్పన వుండాలని అధికారులకు స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలు అనగానే ఇప్పటివరకు రాజమహేంద్రవరం పేరు ప్రధానంగా వినిపించేదని, వచ్చే గోదావరి పుష్కరాల నిర్వహణతో తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకుని, పుష్కరాలు అంటే తెలంగాణ అనే స్థాయిలో మన రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల నిర్వహణలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు, దేవాదాయ శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక అధికారి కార్యాలయం కేంద్ర బిందువుగా పనిచేస్తుందని మంత్రి సురేఖ తెలిపారు. గోదావరి నది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా వున్నందున గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పాత ఘాట్లను పటిష్టం చేస్తూ, కొత్త ఘాట్లను మళ్ళీ వచ్చే పుష్కరాల వరకు మనగలిగేలా పటిష్టంగా నిర్మించాలని మంత్రి సురేఖ అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డైరక్టర్ హనుమంతరావు, ఆర్జేసి రామకృష్ణారావు, డిసి కృష్ణ ప్రసాద్, పలువురు దేవాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.



 

ఇప్పటికే పలు ఘాట్ల నిర్మాణ పనులు ప్రారంభం: డైరక్టర్ హనుమంతరావు

గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను దేవాదాయ శాఖ డైరక్టర్ హనుమంతరావు మంత్రికి వివరించారు. గోదావరి పరిహాక ప్రాంతంలో ఎంచుకున్న ప్రాంతాల్లో ఇప్పటికే ఘాట్ల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. టైర్-1, టైర్-2 పరిధిలో సుమారు 2 కి.మీ మేర ఘాట్ల నిర్మాణ పనులు ప్రారంభించగా, మొత్తంగా టైర్ 1, 2, 3 పరిధిలో 5 కి.మీకి పైగా ఘాట్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. నిధుల వివరాలపై మంత్రి సురేఖ అధికారులను ఆరా తీయగా, అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఆర్ అండ్ బి, పంచాయత్ రాజ్ శాఖలకు నిధులు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. అలాగే మెడికల్, పోలీస్, టూరిజం శాఖలకు నిధులు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. దశలవారీగా టెండర్ల నిర్వహణ, నిధుల మంజూరీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా పలు ఘాట్ల నమూనా చిత్రాలను అధికారులు, మంత్రి పరిశీలించారు. గోదావరి పుష్కరాల కోసం చేపట్టే ప్రతి నిర్మాణాన్ని రాజీ పడకుండా నాణ్యతతో చేపట్టాలని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. పుష్కరాల కోసం చేసే ఏర్పాట్లను తాత్కాలికమైనవిగా భావించకుండా, భవిష్యత్ కార్యక్రమాలను వుపయోగపడేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు.