టెహ్రాన్: తమకు అసలైన శత్రువుగా భావిస్తున్న శక్తులపై వ్యతిరేకంగా ముస్లిం దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఐక్యంగా ఉండాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు. ముస్లింల మధ్య విభేదాలు వారి ప్రత్యర్థుల ప్రయోజనాలకు ఉపయోగపడతాయని ఆయన హెచ్చరించారు. పాలస్తీనియన్ల దుస్థితికి, పశ్చిమాసియాలో నెలకొన్న విసృ్తత ఉద్రిక్తతలకు ప్రాంతీయ అనైక్యతే కారణమని ఆయన పేర్కొన్నారు.

మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఇస్లామిక్ యూనిటీ వీక్ సందర్భంగా ఖమేనీ తన టెలిగ్రామ్ ఖాతాలో ఈ సందేశాన్ని రాతపూర్వకంగా విడుదల చేశారు. ముస్లింలంతా ఐక్యంగా ఉండాలని, వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని, ఒకరికొకరు రక్షణగా నిలవాలని ఆయన కోరారు. ముస్లింల మధ్య తెలిసో తెలియకో విభేదాలు సృష్టించే ఎవరైనా ఇస్లాం శత్రువులకు సహకరిస్తున్నట్లేనని అన్నారు. ముస్లింలు ఐక్యంగా ఉండి ఉంటే పాలస్తీనియన్లు ఇంతగా ‘నిస్సహాయ స్థితిలో’ ఉండేవారా అని కూడా ఖమేనీ ప్రశ్నించారు.

గల్ఫ్ అరబ్ దేశాల పాలకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఆయా దేశాల ప్రజలు, ప్రభుత్వాలు ‘ఇస్లాం జెండా కింద ఐక్యంగా’ ఉండి ఉంటే, ‘గుర్తింపు లేని దుండగులు’ తమ భూభాగాలు, ఆస్తులపై కన్నేసే సాహసం చేసేవారా అని ప్రశ్నించారు. ‘ఇస్లామిక్ దేశాల పాలకులకు, ముఖ్యంగా పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల పాలకులకు నా గట్టిగా, పదేపదే చేస్తున్న సిఫార్సు ఒక్కటే. మీ నిజమైన శత్రువెవరో గుర్తించండి. అతడి ప్రణాళికను అర్థం చేసుకోండి. దాన్ని ఎదుర్కోండి’ అని ఖమేనీ అన్నారు. ఐక్యత కోసం ఆయన చేసిన ఈ పిలుపు శుక్రవారం ఇరాన్ ప్రజలకు చేసిన ప్రకటనను కూడా ప్రతిధ్వనించింది. సామాజిక ఐక్యతను దెబ్బతీసే చర్యలను తాను నిషేధించానని ఆయన చెప్పారు. జాతీయ, ప్రజల మనోధైర్యాన్ని బలహీనపరిచే ‘నిరుత్సాహపరిచే ప్రకటనలకు’ అధికారులు దూరంగా ఉండాలని సూచించారు.

ఆరు నెలల క్రితం అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాయపడినప్పటి నుంచి ఖమేనీ బహిరంగంగా కనిపించలేదు. ఆ దాడుల్లో ఆయన తండ్రి, గతంలో సుప్రీం లీడర్‌గా పనిచేసిన అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం జరిగినప్పటి నుంచి గల్ఫ్ అరబ్ రాజ్యాలు.. రాచరిక వ్యవస్థలకు వ్యతిరేకంగా ఇరాన్ చేస్తున్న ప్రచారం, ప్రాంతీయంగా దాని ప్రభావంతో పాటు ఆ దేశ విప్లవ భావజాలాన్ని తమ రాజకీయ వ్యవస్థలకు ముప్పుగా భావిస్తున్నాయి. ప్రస్తుత ఘర్షణ సమయంలో ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలపై కూడా దాడులు చేసింది. దీంతో ఇరాన్‌కు, దాని గల్ఫ్ పొరుగు దేశాలకు మధ్య ఉన్న ఉద్రిక్తతలు మరింత స్పష్టమయ్యాయి.