మన తెలంగాణ/ బోడుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి దశాబ్ద కాలమవుతున్నా సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ విమర్శించారు.అసంపూర్తి ప్రాజెక్టులకు తక్షణమే నిధులు కేటాయించి, పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం స్పష్టమైన గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు.సాగునీటి ప్రాజెక్టుల సాధనకై సీపీఎం చేపట్టిన పాదయాత్ర రెండో రోజు ఘట్కేసర్‌, మేడిపల్లి మీదుగా బోడుప్పల్‌ (పీర్జాదిగూడ) చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జహంగీర్ మాట్లాడుతూ...బునాదిగాని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వలతో పాటు బస్వాపూర్‌, గంధమల్ల, చర్లగూడెం, రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.నవాబుపేట, అశ్వరాయిపల్లి, ఆసిఫ్‌నగర్‌, బృందావనం కాల్వలను పునరుద్ధరించి చివరి ఆయకట్టు వరకు నీరందించాలి.మూసి నదికి గోదావరి జలాలను అనుసంధానించడమే శాశ్వత పరిష్కారం.షామీర్‌పేట్‌ చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి భువనగిరి ప్రాంతానికి గోదావరి నీటిని మళ్లించాలి.ఈ పాదయాత్రకు సీపీఎం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్, మేడిపల్లి మండల కమిటీల నాయకులు ఘన స్వాగతం పలికారు. సోమవారం రోజున వేలాది మంది రైతులు ఈ యాత్రలో పాల్గొని సంఘీభావం తెలుపుతారని నాయకులు వెల్లడించారు.ఈ సమావేశంలో సీపీఎం నాయకులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, డివైఎఫ్ఐ నాయకుడు అవనగంటి వెంకటేష్, మాటూరి బాలరాజు, దాసరి పాండు,జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి,ఘటకేసర్ నాయకురాలు సబిత,మేడిపల్లి మండల కార్యదర్శి ఎన్ సృజన తదితరులు పాల్గొన్నారు.